Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లే

By:  Tupaki Desk   |   13 Aug 2021 3:23 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లే
X
గతంలో ఏదైనా రాజకీయ అంచనాను వెల్లడిస్తున్నప్పుడు మీడియా సంస్థలు చాలా జాగ్రత్తలు తీసుకునేవి. తమ రాజకీయ అంచనా ఏ మాత్రం తేడా కొట్టినా ప్రజల్లో పలుచన అవుతామన్నట్లుగా ఫీలయ్యేవారు. దీంతో.. తమకున్న పక్కా సోర్సుతో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే వివరాలు వెల్లడయ్యేవి. ఇంత భారీగా కసరత్తు చేసిన తర్వాత తేడా కొట్టే అవకాశమే ఉండేది కాదు. కాలం మారింది. మీడియాకు మించి సోషల్ మీడియా వచ్చేసింది. ఎక్కడో ఎవరో కూర్చొని.. వారి బుర్రకు బుద్ధి పట్టినట్లుగా రాసేయటం అలవాటుగా మారింది.

ఈ తరహా వార్తలకు.. కథనాలకు ప్రధాన మీడియా సైతం ప్రభావితం కావటం ఈ మధ్యన ఎక్కువైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ రోజు.. రేపు అన్నట్లు ఉందని.. ఏ క్షణంలోనైనా ప్రకటిస్తారన్న హడావుడి జరిగింది. దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ పార్టీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించటంతో.. ఉప ఎన్నికకు వేళాయరా అన్నట్లు ఫీలయ్యారు. ఇలాంటివేళ.. ఇలాంటి అంచనాల మీద నీళ్లు కుమ్మరించేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

త్వరలో నిర్వహించాల్సిన ఉప ఎన్నికల మీదా.. రానున్న కొద్ది నెలల్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల మీద పార్టీలను అభిప్రాయాలు వెల్లడించాలని కోరుతూ తాజాగా రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. దీంతో.. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే.. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించటం కోసమే ఈ నెల 30 వరకు గడువు ఇచ్చిన నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు.

సాధారణంగా ఏ ఎన్నికలు నిర్వహించే ముందైనా.. ఇలా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈసీ ఇలాంటి కసరత్తు చేస్తుంటుంది. పార్టీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించిన తర్వాత.. వారిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని ఈసీ నిర్ణయం తీసుకోవటం అంటే.. మరింత కాలం సమయం పట్టే వీలుంది. ఒకట్రెండు రోజుల్లో ఉప ఎన్నిక ఉంటుందన్న హడావుడి జరిగిన నేపథ్యంలో.. మరికాస్త సమయం పడుతుందన్న సంకేతాల్ని తాజా నోటీసుతో ఈసీ స్పష్టం చేసిందని చెప్పాలి.

ఇదంతా చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విషయంలో తాజాగా ఈసీ రాజకీయ పార్టీలకు షాకిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఉప ఎన్నికను నిర్వహిస్తే.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బరిలోకి దిగాలని భావిస్తున్న నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది.

ఏదైనా అసెంబ్లీ.. పార్లమెంటుకు సంబంధించిన స్థానం ఒకటి ఖాళీ అయితే.. ఖాళీ అయిన రోజు నుంచి ఆర్నెల్ల లోపు ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మమతకు మరికాస్త టైం ఉందనే చెప్పాలి. మమత బెనర్జీ అసెంబ్లీకి ఎన్నిక కాకుండా చూడాలని.. ఒక్క రోజైనా ఆమె తన సీఎం పదవికి రాజీనామా చేసేలా చూడాలన్న పంతం కేంద్రంలో కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో ఉప ఎన్నిక ప్రక్రియను ఆలస్యం చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వెనువెంటనే ఉప ఎన్నికను నిర్వహించే కన్నా.. ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం ఉండే వీలుంది. సో.. ఈ నెలాఖరు వరకైతే మాత్రం ఎన్నికల నోటిషికేషన్ విడుదలయ్యే చాన్సు లేదని చెప్పక తప్పదు.