Begin typing your search above and press return to search.

కేసీయార్ చాణక్యానికి నిజమైన పరీక్ష

By:  Tupaki Desk   |   15 Aug 2021 6:30 AM GMT
కేసీయార్ చాణక్యానికి నిజమైన పరీక్ష
X
తెలంగాణాలో ఇప్పటివరకు ఎన్ని ఉపఎన్నికలు వచ్చినా కేసీయార్ కు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక మాత్రం పెద్ద పరీక్ష పెడుతోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీదు. ఎవరు గెలుస్తారో కూడా ఎవరు చెప్పలేకున్నారు. గెలుపోటముల కన్నా ముందు దళిత బంధు రూపంలోనే కేసీయార్ కు నిజమైన పరీక్ష ఎదురు కాబోతోంది. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక పార్టీకి పెద్ద సమస్యగా మారిపోయింది.

రేపటి బహిరంగ సభలో ఈ అంశాన్ని సీఎం ఎలా మ్యానేజ్ చేస్తారో అనే టెన్షన్ పెరిగిపోతోంది కారు నేతల్లో. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 16వ తేదీన కేసీయార్ బహిరంగసభ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వివాదమైపోయిన దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అంశం బహిరంగసభలో బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పథకం లబ్దిదారులను శుక్రవారానికి అధికారులు 500 మందిని ఎంపికచేశారు. అయితే వీరిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, పార్టీ చెప్పిన వాళ్ళనే ఎంపిక చేసినట్లు దళితులు మండిపోతున్నారు.

గురు, శుక్రవారాల్లో లబ్దిదారుల జాబితాపై ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర దళితులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇవే గొడవలు శనివారం కూడా కంటిన్యూ అయ్యాయి. మరి దీని ప్రభావమో ఏమో తెలీదు కానీ నియోజకవర్గం మొత్తం మీద కేవలం 15 మంది లబ్దిదారులను మాత్రమే కలెక్టర్ కర్ణన్ ఎంపిక చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇదే జాబితాను కలెక్టర్ సీఎం ముందుంచబోతున్నారట.

ప్రచారం జరుగుతున్నట్లు కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేసినా ఇదికూడా మరో సమస్యగా మారేట్లుంది. ఎలాగంటే నియోజకవర్గం మొత్తం మీద 5 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మొదట్లో కేసీఆర్ చెప్పారట. అందుకనే పార్టీ నేతలు+అధికారులు హడావుడిగా లబ్ధిదారుల జాబితాలను ఎంపిక చేశారు. దాంతో నియోజకవర్గం వ్యాప్తంగా గొడవలైపోయాయి.

అంటే వేలాది మందితో జాబితా తయారైతే బోగస్ పేర్లున్నాయని గొడవ. అలా కాదని కేవలం 15 మందిని మాత్రమే ఇపుడు లబ్దిదారులను ఎంపిక చేస్తే నిజమైన లబ్దిదారులను పక్కనపెట్టేశారంటు మరో గొడవ మొదలవుతుంది. పథకం అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం పెరిగినట్లవుతుంది. మరి ఇన్ని గందరగోళాల మధ్య బహిరంగసభను కేసీయార్ ఎలా మ్యానేజ్ చేస్తారా ? ఎలాంటి వ్యూహం అనుసరిస్తారా ? అనే టెన్షన్ పెరిగిపోతోంది.