Begin typing your search above and press return to search.

ఈటలను డిఫెన్స్ లో పడేస్తున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   23 Aug 2021 5:12 AM GMT
ఈటలను డిఫెన్స్ లో పడేస్తున్న కేసీఆర్
X
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ను డిఫెన్స్ లో పడేసేలా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఈటలను ఒంటరిని చేసేలా పకడ్బందీగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఈటలను ఏకాకిని చేసి ఓడించాలని పథక రచన చేస్తున్నాడు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను బీజేపీలో లోపల.. వెలుపల క్రమంగా ఒంటరిగా కనిపిస్తున్నారు.. నియోజకవర్గంలో అనుకుంటున్న టాక్ ప్రకారం.. బీజేపీ అధిష్టానం హుజూరాబాద్ లో ప్రచారానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. సహకరించడం లేదని అంటున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిజయ్ కూడా తాజాగా యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణం పట్ల సంతాప సూచకంగా ఆగస్టు 24 నుంచి తను చేయాల్సిన పాదయాత్రను వాయిదా వేసుకున్నాడు.

ఇక స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈటల రాజేందర్ కు మద్దతుగా సగం మనస్కులై ఉన్నారని.. ఎందుకంటే పార్టీ క్యాడర్ కోసం డబ్బు ఖర్చు చేయడం లేదని తెలిసింది.

మరోవైపు పాలక టీఆర్ఎస్ మాత్రం ఇదే అదునుగా ఈటల రాజేందర్ అనుచరులను ఆకర్షిస్తోంది. సామధాన భేద దండోపాయాలతో ఆయనకు అండగా మూలస్తంభాల్లా ఉంటున్న వారిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ క్రమపద్ధతిలో చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే ఈటల అనుచరులు అతడిని విడిచిపెడుతూ వరుసగా టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బు, పదవులు ఆఫర్ చేస్తుండడంతో అటువైపు ఆకర్షితులు అవుతున్నారు. సీనియర్ మంత్రి టీ.హరీష్ రావు హుజూరాబాద్ రంగంలోకి దిగడంతో ఇప్పుడక్కడ ఈటల బలం పడిపోతూ టీఆర్ఎస్ బలం పెరిగిపోతూ ఉంది.

ఆదివారమే ఈటలతోపాటు బీజేపీ చేరిన ఆయన సన్నిహిత నేతలు ఇద్దరూ ఆపార్టీకి రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ లో చేరిపోవడం ఈటలకు గట్టి షాక్ ఇచ్చినట్టైంది. ఇందులో ఒకరు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైఎస్ చైర్మన్ పింగిలి రమేశ్ కాగా.. మరో నాయకుడు చుక్క రంజిత్ ఇదివరకు ఈటల రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. బీజేపీకి వీరిద్దరూ రాజీనామా చేయడం ఈటలకు గట్టి షాక్ గా చెబుతున్నారు. బీజేపీలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.

దళిత బంధు పథకాన్ని ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పై వారు ప్రశంసల వర్షం కురిపించారు. దీనిని వారు చారిత్రాత్మక పథకంగా అభివర్ణించడం విశేషం. రాబోయే కొద్దిరోజుల్లో ఈటల అనుచరులు మరింతమంది బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరుతారని అంటున్నారు. ఇదే జరిగితే ఈటలకు భారీ దెబ్బపడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికైనా బీజేపీ తేరుకొని దూకుడు పెంచాలని శ్రేణులు కోరుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి చాలా మంది టీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. మరింత మంది బీజేపీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ది కూడా ఇదే జిల్లా కావడంతో ఇక్కడి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా నియోజకవర్గాన్ని చేజారనివ్వకుండా చూడాలని వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతో ప్రచారం చేస్తూ వాటిని అమలు చేస్తామని అంటున్నారు. ఈనెల 16న కేసీఆర్ హుజూరాబాద్లో పర్యటించి హైప్ పెంచారు. ఈ పర్యటన నియోజకవర్గ ప్రజల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో బీజేపీ తరుపున విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరవ్వాలని కమలం క్యాడర్ ప్లాన్ వేస్తోంది.