Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రేపేనా?

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:28 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రేపేనా?
X
తెలంగాణ రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు రంగం సిద్ధమైందా? ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను రిలీజ్ చేయనున్నారా? ఇందుకు సంబంధించి అన్నిప్రక్రియలు పూర్తి చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ అయితే శుక్రవారం.. లేదంటే శనివారం కచ్ఛితంగా విడుదల చేస్తారన్న మాట వినిపిస్తోంది. ఈ మేరకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు సంకేతాలు అందినట్లుగా ప్రచారం సాగుతోంది.

గడిచిన వారంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్ని ఇచ్చాయి. ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పాడె కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఓకే చేయటం.. దానికి సంబంధించిన ప్రకటన చేయటంతో పాటు.. తాజాగా వాసాలమర్రిలో దళితబంధు కార్యక్రమాన్నియుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిసైడ్ చేయటం లాంటి పరిణామాలు కొత్త సందేహాల్ని కలిగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ ఉప ఎన్నిక ఫలితం తాము అనుకున్నట్లుగా రావటానికి అన్నట్లుగా టీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది. మంత్రి హరీశ్ నియోజకవర్గంలో ఉండి మరి మానిటర్ చేస్తున్నారు. హుజూరాబాద్ పార్టీ సమన్వయం చూస్తున్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడే మకాం వేయటం గమనార్హం. ఇదంతా కూడా ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలోనే అన్న వాదన వినిపిస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుండటమే కాదు.. ఈ ఎన్నికను ఏ రీతిలో ఎదుర్కోవాలన్న అంశంపై టీఆర్ఎస్.. కాంగ్రెస్.. బీజేపీలో పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే అస్వస్థతకు ఆసుపత్రికి చేరిన ఈటల రాజేందర్ ఈ రోజు (గురువారం) డిశ్చార్జి కానున్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా హుజూరాబాద్ కు వెళతారని చెబుతున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇప్పటికిప్పుడు వెలువడే అవకాశం లేకుంటే.. ఇంత వేగంగా పరిణామాలు చోటు చేసుకోవని.. అత్యుత్తమ స్థాయి నుంచి అందిన సంకేతాలతోనే ఉప ఎన్నిక హడావుడి మొదలైనట్లు చెబుతున్నారు.

ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా.. ఈటల రాజకీయ భవిష్యత్తు లెక్క తేల్చే అవకాశం ఉన్న ఈ ఉప ఎన్నికను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా తీసుకోవటంతో దీనిపై అంచనాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. గతంలో మరే ఉప ఎన్నిక వేళలో జరగనంత బిగ్ ఫైట్ జరగనుందని..ఎన్నికల ఖర్చు కూడా భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అందరి చూపు హుజూరాబాద్ మీదనే అన్నట్లుగా మారిన ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ అంచనాలకు తగ్గట్లు విడుదలైతే మాత్రం.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మరింతగా హీటెక్కటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.