Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉపపోరు విచిత్రం.. పోటీ చేసినోళ్లు ఓటు వేయలేదు

By:  Tupaki Desk   |   31 Oct 2021 12:47 PM IST
హుజూరాబాద్ ఉపపోరు విచిత్రం.. పోటీ చేసినోళ్లు ఓటు వేయలేదు
X
ఇప్పటివరకు జరిగిన ఏ ఉప ఎన్నికకు లేనంత ప్రతిష్ఠాత్మకత.. వందల కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయటం.. ఈ ఉప ఎన్నిక కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్ఠాత్మక పథకాన్ని తీసుకురావటం.. యుద్ధ ప్రాతిపదికన అమలు చేయటం లాంటి ఎన్నో విశేషాలు హుజూరాబాద్ ఉప ఎన్నికను చూసినప్పుడు కనిపిస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే..ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో మూడొంతుల మంది అభ్యర్థులు ఓటు వేయని విచిత్రం కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకే సొంతమని చెప్పాలి. ఈ సిత్రమైన సీన్ కు కారణం ఏమిటన్నది చూస్తే..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉప ఎన్నికను చెప్పాలి. ఇంతటి కీలకమైన ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈటల చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. తన సర్వశక్తులు ఒడ్డారు. ఈ ఎన్నిక ఆయనకు ఎంత కీలకమైనదన్న విషయాన్ని ఎన్నికల ప్రచార సమయంలో ఆయన నోటినుంచి రావటం గమనార్హం. తన సతీమణి జమున.. ఎన్నికల్లో గెలవటం కోసం అవసరమైతే ఆస్తులు కూడా అమ్మేయాలని తనకు చెప్పినట్లుగా ఈటల పేర్కొనటం సంచలనంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో కేవలం పది మంది మాత్రమే ఓటు వేయగా.. మిగిలిన 20 మంది అభ్యర్థులు మాత్రం ఓటు వేయలేదు. ఓటు వేయని అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింహారావుతో సహా 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎందుకిలా? అంటే.. వీరంతా హుజూరాబాద్ కు నాన్ లోకల్. వీరి ఓట్లు వేర్వేరు చోట్ల ఉండటంతో హుజూరాబాద్ లో ఓటు వేయలేకపోయారు.
ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థినే తీసుకుంటే.. అతగాడి ఓటు హైదరాబాద్ లో ఉంది. అలానే మరో 19 మంది అభ్యర్థుల ఓట్లు వేర్వేరు చోట్ల ఉండటంతో వారంతా తమకు ఓటు వేయాలని ఓటర్లను అడగటమే కానీ.. తాము మాత్రం ఓటు వేయలేకపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ లో ఓటు వేశారు.

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు కమలాపూర్ లో ఓటు వేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉన్న కేశెట్టి విజయ్ కుమార్ హుజూరాబాద్ లో ఓటు వేయగా.. దేవునూరి శ్రీనివాస్ వీణవంకలో.. సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో.. పల్లె ప్రశాంత్ కన్నూరులో.. మ్యాకమల్లరత్నయ్య మడిపల్లిలో మౌటం సంపత్ కమలాపూర్ లో శనిగరపు రమేశ్ బాబు కమలాపూర్ లో.. రావుల సునీల్ కన్నూరులో తమ ఓట్లు వేశారు. ఓట్లు వేయని 20 మంది అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాల వారు కావటంతో ఓటు వేయలేకపోయారు. ఒక ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యధికులు నాన్ లోకల్స్ గా ఉండటం హుజూరాబాద్ ఉప పోరు స్పెషల్ గా చెప్పక తప్పదు.