Begin typing your search above and press return to search.

హుజురాబాద్ భ‌యం కేసీఆర్‌లో క‌నిపిస్తోందిగా!

By:  Tupaki Desk   |   24 July 2021 3:05 AM GMT
హుజురాబాద్ భ‌యం కేసీఆర్‌లో క‌నిపిస్తోందిగా!
X
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా అయిన హుజూరాబాద్ ఇప్పుడు తెలంగాణ‌లో అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈటల ప్రాతినిధ్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త్వ‌ర‌లో ఉప ఎన్నికలు జ‌ర‌గ‌నుండగా ఇందులో ఈట‌ల బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో దిగుతున్నారు. ఈట‌ల‌కు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బ‌లానికి తోడుగా బీజేపీ సైతం క్షేత్ర‌స్థాయిలో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం త‌న ప్లాన్‌ల‌కు ప‌దునుపెడుతున్నారు. అయితే, మునుపెన్న‌డూ లేని రీతిలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు హుజురాబాద్ బై పోల్ విష‌యంలో కేసీఆర్ భయ‌ప‌డుతున్నారా? అన్న చ‌ర్చను క‌నిపిస్తోంది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌కు భారీగా మేలు జ‌రిగేలా ద‌ళిత బంధు స్కీం ప్రక‌టించారు. దీనితోపాటుగా త్వ‌ర‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని దాదాపు 400 మంది ద‌ళితుల‌తో త్వ‌ర‌లో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ఇలా స‌ర్వం హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్న చ‌ర్య‌ల్లో మ‌రొక‌టి తోడ‌యింది. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నామినేటెడ్ నియామ‌కం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణాలు ఉన‌నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో పనిచేశారు. దీంతో పాటుగా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్‌గా, హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ శ్రీ‌నివాస్ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ముఖ్య అనుచ‌రుడు. ఎంద‌రో రాష్ట్ర స్థాయి నాయ‌కులు, ముఖ్య నేత‌లు, మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండ‌గా శ్రీ‌నివాస్‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం వెనుక కార‌ణం హుజురాబాద్ ఉప ఎన్నికేన‌ని అంటున్నారు.