Begin typing your search above and press return to search.

ర‌స‌కందాయంలో హుజూరాబాద్ రాజ‌కీయాలు

By:  Tupaki Desk   |   19 July 2021 8:30 AM GMT
ర‌స‌కందాయంలో హుజూరాబాద్ రాజ‌కీయాలు
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ తెలంగాణ‌లో రాజ‌కీయ మంట రాజేసింది. భూ క‌బ్జా కోరు ఆరోప‌ణ‌ల‌తో ఈటల రాజేంద‌ర్‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచి మంత్రిగా భ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్పుడు మొద‌లైన వేడి రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతూనే ఉంది. ఈటల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ శాస‌న‌స‌భ స్థానంపైనే ప్ర‌ధాన పార్టీల‌న్నీ దృష్టి పెట్టాయి.

ఎత్తులు పైఎత్తులు వ్యూహాలు ప్ర‌తివ్యూహాల‌తో ఇంకా షెడ్యూల్ కూడా రాక‌ముందే ఈ ఉప ఎన్నిక్ హాట్‌హాట్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఈ కాక‌ను మ‌రింత పెంచుతున్నాయి.

టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల ఆ పార్టీ త‌ర‌పున ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాడ‌ని అంతా అనుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న స‌తీమ‌ణి జ‌మున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ పోటీలో తానూ ఉన్న‌ట్లు బాంబు పేల్చారు.

ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటి ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌ర్య‌టిస్తున్న ఆమె రాబోయే ఈ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేసినా తాను పోటీచేసినా ఒక్క‌టేన‌ని పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఎన్నిక‌ల్లో పోటీకి ఈట‌ల దూరంగా ఉంటార‌ని మ‌రోవైపు ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

ఉప ఎన్నిక‌లో ఎవ‌రు పోటీ చేయాల‌నే విష‌యంపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని జ‌మున అన్నారు. ఇద్ద‌రిలో బీజేపీ ఎవ‌రికి అవ‌కాశం ఇచ్చినా స‌రేన‌న్న‌ట్లు ఆమె వ్యాఖ్య‌లున్నాయి. దీంతో ఈట‌ల పోటీకి దూరంగా ఉంటార‌నే ప్ర‌చారంలో నిజం ఉందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి నిజానిజాలేంటో త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు ఈట‌ల‌ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లో ద‌ళిత సాధికారిత కోసం తెలంగాణ ద‌ళిత బంధు పేరుతో ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప‌థ‌కాన్ని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే మొద‌ట ప్రయోగాత్మ‌కంగా చేపట్టాల‌ని నిర్ణ‌యించ‌డం వెన‌క కేసీఆర్ ఉద్దేశం ఏమిటో స్ప‌ష్టంగా తెలుస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఉప ఎన్నిక‌లో ఈట‌ల‌ను దెబ్బ కొట్ట‌డం కోస‌మే వ్యూహాత్మ‌కంగా ఈ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ముందుగా హుజూరాబాద్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా కేసీఆర్ ప్రారంభిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌థ‌కంలో భాగంగా ఎంపిక చేసిన ఒక్కో ద‌ళిత పేద కుటుంబానికి రూ.ప‌ది ల‌క్ష‌ల ఆర్థిక సాయం అంద‌జేస్తారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ వంద కుటుంబాల‌కు సాయం చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు.

దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.1200 కోట్ల‌తో ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేవ‌లం ఒక్క హుజూరాబాద్‌లోనే అద‌నంగా రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ ఖర్చు చేయ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు. ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇంత భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్ట‌డం వెన‌క ప‌క్కాగా ఎన్నిక‌ల వ్యూహం ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈట‌ల‌ను ఓడించ‌డానికి ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌నేందుకు ద‌ళిత బంధు ప‌థ‌క‌మే నిద‌ర్శ‌మ‌ని అనుకుంటున్నారు.