Begin typing your search above and press return to search.

గెలుపుపై ‘హుజూరాబాద్’ హాట్ హాట్ చర్చ..

By:  Tupaki Desk   |   1 Nov 2021 6:39 AM GMT
గెలుపుపై ‘హుజూరాబాద్’ హాట్ హాట్ చర్చ..
X
ఎన్నడూ లేనంతగా తీవ్ర ఉత్కంఠతో సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఈవీఎంలో భద్రంగా నిక్షిప్తమైంది. మంగళవారం ఓట్ల లెక్కింపుతో ఎవరు గెలుస్తారో తేలనుంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్లో ఎవరు గెలుస్తారోనని తీవ్ర చర్చ మొదలైంది. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడి ఫలితంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థినా.. లేక బీజేపీకి చెందిన అభ్యర్థినా..? అన్న బేరీజు వేసుకొని మరీ చర్చలు పెట్టుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికతో ప్రభుత్వాలు మారకున్నా.. ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేకుండా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ ఫలితం ప్రభావం చూపుందని అంటున్నారు. ఏ పార్టీ గెలిచినా దానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్లస్ పాయింట్ కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినేట్ నుంచి భర్త్ చేయడం మొదలు నుంచి దాదాపు ఆరు నెలలుగా హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. మంత్రి వర్గం నుంచి వైదొలిగిన తరువాత ఆయన బీజేపీలో చేరడం ఆసక్తిగా మారింది. అధికార పార్టీకి ఇప్పటికే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి ఈటల చేరికతో బలం పెరిగింది. దీంతో ఈటల గెలుపు తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని భావించిన పార్టీ నాయకులు ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా పాదయాత్ర చేసి ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో పాటు రాష్ట్ర నాయకులు సైతం హుజూరాబాద్లో కొన్ని రోజుల పాటు మకాం వేసి ఊరూరా తిరిగారు. దీంతో వారి శ్రమకు తగ్గ ఫలితం వస్తుందా..? అని అనుకుంటున్నారు.

అధికారంలో ఉన్న టీఆర్ఎప్ ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారని, మా పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నా కేసీఆర్ పై నమ్మకంతో ప్రజలు ఓట్లేస్తారని ఆ పార్టీ భావించింది. టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ భర్త్ రఫ్ తరువాత ఆయన స్థానంలో మరో నేతను తయారు చేసేందుకు పార్టీ ప్రయత్నించింది. అందుకు కౌశిక్ రెడ్డి లాంటి నేతలు ఉన్నా బీసీ నేతకే టికెట్ ఇచ్చారు. టీఆర్ఎస్వీ నాయకుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ కు టికెట్ కేటాయించి అక్కడ గెలిపించే బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో హరీశ్ రావు నెల రోజుల పాటు తీవ్రంగా ప్రచారం చేశారు.

హుజూరాబాద్లో టీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలియడంతో నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆ వర్గం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొందరికి ఆ పథక ఫలాలను కూడా అందించారు. ఇక ఇతర సామాజిక వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించారు. దీంతో అన్ని వర్గాలను ఆకట్టుకున్నారని అంటున్నారు. సంక్షేమ ఫలాలు, కేసీఆర్ పై ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు.

నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. మొత్తగా 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా మాత్రం టీఆర్ఎస్, బీజేపీపైనే ఫోకస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రంగానే బరిలో ఉన్న పట్టు సాధించేందుకు ప్రయత్నం చేసింది. ఇక కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఓట్లను చీల్చారా..? అన్న చర్చ కూడా సాగుతుంది. అయితే ఓట్లు వేయడానికి కొన్ని పార్టీలు డబ్బులు పంచి మరీ ఓట్లు వేయించారని అనుకుంటున్నారు.అందుకే రాత్రి వరకు పోలింగ్ జరిగిందని అంటున్నారు. అయితే ప్రధానంగా గెలుపు మాత్రం టీఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థి ఉంటుందని అంటున్నారు.