Begin typing your search above and press return to search.

హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్.. వాళ్లు ఒమిక్రాన్ నుంచి సేఫ్!

By:  Tupaki Desk   |   5 Dec 2021 8:34 AM GMT
హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్.. వాళ్లు ఒమిక్రాన్ నుంచి సేఫ్!
X
కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలంతో ప్రతిఒక్కరికీ ఆరోగ్యంపై స్పృహ కలిగింది. శుభ్రత నుంచి మొదలుకుంటే తినే వరకు అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇకపోతే మార్కెట్ లో ఏమన్నా కొనాలన్నా కూడా వాటివల్ల కలిగే లాభాలను అడుగుతున్నారు. ఒంట్లో ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. రోగనిరోధక శక్తి ఉన్న పండ్లు, కూరగాయలు వంటి వాటికే అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీ, హైబ్రిడ్ ఇమ్యూనిటీ వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే..?

మనిషి శరీరంలో ఉండే రకరకాల రోగనిరోధక శక్తుల గురించి దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్రిటికల్ కేర్ డిపార్టుమెంట్ కు చెందిన ఓ వైద్యుడు వివరించారు. వాటిలో ఒకటి వ్యాక్సినే వల్ల వచ్చో రోగనిరోధక శక్తి. వైరస్ బారిన పడి... కోలుకున్న తర్వాత వచ్చే ఇమ్యూనిటీ రెండోది. అయితే ఈ రెండింటి మిక్సింగ్ హైబ్రిడ్ ఇమ్యూనిటీ. అనగా కరోనా బారిన పడిన వ్యక్తి... వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే ఇమ్యూనిటీ అన్నమాట. ఈ రోగనిరోధక శక్తి మిగతా రెండింటితో పోల్చితే చాలా శక్తివంతమైందని ఆయన తెలిపారు.

డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లతో ప్రాణానికి ప్రమాదం ఉందని చెబుతున్న వైద్య నిపుణులు... హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంటే సురక్షితంగా బయటపడవచ్చునని చెబుతున్నారు. అతి ప్రమాదకారిగా చెబుతున్న ఒమిక్రాన్ ను హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఎదుర్కొగలదని తెలిపారు. అయితే హైబ్రిడ్ ఇమ్యూనిటీ కలిగిన వాళ్లు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. అప్పుడు ఎంతటి ప్రమాదకరమైన వేరియంట్ అయినా ఏం చేయలేదని అభిప్రాయపడుతున్నారు.

దేశంలో ఇప్పటికే 60 నుంచి 70 శాతం మందికి కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. వారిలో చాలామంది ఇప్పటివరకు టీకా తీసుకున్నారని చెప్పారు. ఫలితంగా వారందరూ హైబ్రిడ్ ఇమ్యూనిటీని కలిగి ఉన్నారని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఒమిక్రాన్ వేరియంట్ నుంచి దాదాపు వీళ్లందరూ సేఫ్ గా బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపోతే మూడో వేవ్ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో స్వీయ నియంత్రణ అవసరం అని చెబుతున్నారు. కాగా దాదాపు తొంభై రోజుల పాటు రోగనిరోధక శక్తి ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు. మరికొందరిలో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉండే అవకాశం కూడా ఉందని వివరించారు.