Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. గంటకు 120 కి.మీ. స్పీడ్

By:  Tupaki Desk   |   9 Dec 2022 8:30 AM GMT
హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. గంటకు 120 కి.మీ. స్పీడ్
X
హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంలా మారనున్న ఎయిర్ పోర్టు మెట్రోకు ఈ రోజు (శుక్రవారం) శంకుస్థాపన చేస్తున్నారు. రోటీన్ కు కాస్తంత భిన్నంగా ఈ కార్యక్రమం జరగనుంది. సాధారణంగా హైదరాబాద్ మహానగరంలో జరిగే ఏ కార్యక్రమానికైనా మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కావటం ఒక ఆనవాయితీగా మారింది. అందుకు భిన్నంగా తాజా ప్రాజెక్టు శంకుస్థాపన మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది. దగ్గర దగ్గర రూ.6500 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్టు మెట్రో లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

నిత్యం వందలాది మంది ఎయిర్ పోర్టుకు వెళ్లి వస్తుండటం.. రానున్న రోజుల్లో పర్యాటకం మరింత పెరిగి.. ప్రయాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువ కానుంది. ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్లుగా తాజా ఎయిర్ పోర్టు మెట్రోను నిర్మిస్తున్నారు.

అత్యాధునిక సాంకేతికతతో ఈ రైలును నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం 31 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మెట్రోలో సింహ భాగంగా ఫిల్లర్ల మీద నడుస్తుండగా.. 2.5 కిలోమీటర్లు సొరంగ మార్గంలో.. ఒక కిలోమీటరు రోడ్డు (రోడ్ లెవల్) మీద నడవనున్నట్లు చెబుతున్నారు.

ప్రతి నాలుగైదు కిలోమీటర్లకు ఒక రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేస్తారు. మొత్తం 8-9 మధ్య స్టేషన్లు ఉండనున్నాయి. అలా అని ఆ స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని తాము అప్పుడే వెల్లడించలేమన్నారు. ఇక.. రైలు వేగం విషయానికి వస్తే నగరంలో అత్యంత వేగంతో ప్రయాణించే ప్రజా రవాణాగా దీన్ని చెప్పాలి.

ఎయిర్ పోర్టు మెట్రో రైలు వేగం గంటకు 120 కి.మీ. వేగంతో నడవనుంది. ప్రస్తుత మెట్రో రైలు గంటకు 35-40 కి.మీ. వేగంతో నడుస్తుంటే అందుకు మూడు రెట్ల వేగంతో ఎయిర్ పోర్టు మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ కారణంగా కేవలం 26 నిమిషాల వ్యవధిలో ఎయిర్ పోర్టుకు చేరనున్నారు. మొదట్లో తక్కువ సర్వీసులు నడిపినా.. రద్దీకి తగ్గట్లుగా ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక సర్వీసు నడిపేలా ప్లాన్ చేస్తున్నట్లుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.