Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఇప్పటికే దేశానికి రెండో రాజధాని
By: Tupaki Desk | 18 Jan 2018 2:38 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ - పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి - ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా మరింత ఆసక్తికర ప్రకటన చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశానికి రెండో రాజధానిగానే కొనసాగుతుందని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్-2018 సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. చర్చా గోష్ఠి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ .. హైదరాబాద్ కు వచ్చిన ప్రతీసారి తాను ఆశ్చర్యానికి గురౌతున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటే హైదరాబాద్ మెరుగైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశానికి రెండు రాజధానులు ఉండాలని అది హైదరాబాదే కావాలని అభిప్రాయపడుతూ ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. `రాజ్ దీప్ మీకో విషయం గుర్తుచేయదలచుకున్నా. దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రపతి నిలయం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. శీతాకాల విడిది నిమిత్తం ప్రతిఏటా భారత్ రాష్ట్రపతి ఈ మహానగరానికి విచ్చేస్తుంటారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ హైదరాబాద్ దేశానికి ఎప్పుడూ రెండో రాజధానిగా కొనసాగుతోంది` అని పేర్కొన్నారు.
కాగా ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కూడా రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే అంశంపై సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ ఆసక్తికరమైన రిప్లై ఇవ్వడం గమనార్హం. `దేశ ప్రజలు కోరుకుంటే హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడంలో ఎలాంటి నష్టం లేదు. దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. మన ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశానికి రాజధానిగా హైదరాబాద్ చేస్తారనడంలో తప్పు లేదు. ప్రజలు అంగీకరిస్తే...మాకేం ఇబ్బంది లేదు` అని అన్నారు.