Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఎలాంటి గౌరవం దక్కిందంటే?

By:  Tupaki Desk   |   11 April 2019 6:17 AM GMT
హైదరాబాద్ కు ఎలాంటి గౌరవం దక్కిందంటే?
X
దేశంలో మెట్రో నగరాలున్నా.. నిత్యం ఏదో ఒక ఇష్యూలో హైదరాబాద్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు తగ్గట్లే మరో అంశంలో హైదరాబాద్ గొప్పతనం దేశానికి తెలిపే నివేదిక ఒకటి వెల్లడైంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని ఆకర్షించటంలో దేశంలోని మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ విషయంలో మొదటి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ కి చెందిన ఎన్ సీఆర్ నిలువగా.. రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. మూడో స్థానాన్ని మాత్రం హైదరాబాద్ సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని అతి పెద్ద ప్రొఫెషనల్ నెట్ వర్క్ అయిన లింక్డ్ ఇన్ తెలిపింది. ఈ సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి రూపొందించిన భారత ఉద్యోగస్తుల నివేదికలో ఈ వివరాల్ని వెల్లడించింది. కొత్తగా ఏ ఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి? ఎలాంటి నిపుణులకు డిమాండ్ ఉందన్న విషయంతో పాటు.. దేశంలోని ఏ ఏ నగరాల్లో ఉద్యోగాలు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని ఈ నివేదిక వెల్లడించింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్.. బిజినెస్ మేనేజ్ మెంట్ రంగాలకు 2018లో విశేష డిమాండ్ కనిపించినట్లు పేర్కొంది. నిపుణుల్ని ఆకర్షించే నగరాల విషయానికి వస్తే.. ఎన్ సీఆర్.. బెంగళూరు.. హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. అహ్మదాబాద్ నిలిచాయి. చివరి స్థానాల్లో చండీగఢ్.. వడోదర.. జయపుర నిలవటం గమనార్హం.

బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని భావించే యువత సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందన్న విషయాన్ని లింక్డిన్ వెల్లడించింది. యువత తొలి ఎంపిక అమెరికానేనని.. తర్వాతి స్థానంలో యూఏఈ.. కెనడా.. యూకే.. ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.