Begin typing your search above and press return to search.

అభయ్ హ‌త్య‌కు ఆ సినిమానే కార‌ణమంట‌

By:  Tupaki Desk   |   20 March 2016 1:35 PM GMT
అభయ్ హ‌త్య‌కు ఆ సినిమానే కార‌ణమంట‌
X
సినిమా ఎంత ప‌వ‌ర్‌ఫుల్ మీడియం అన్న విష‌యం తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. అప్ప‌ట్లో వ‌చ్చిన ఒక తెలుగు సినిమా ప్ర‌భావంతో కిడ్నాప్ చేసి.. భారీగా సంపాదించి..సినిమాల్లో న‌టించాల‌న్న కోరిక‌ను తీర్చుకోవాల‌ని భావించిన కుర్రాళ్లు ఇప్పుడు క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లి ఊచ‌లు లెక్కిస్తున్న దుస్థితి. నిండా పాతికేళ్లు లేని ముగ్గురు కుర్రాళ్లు.. అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించాల‌న్న తొంద‌ర‌లో హ‌త్య కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన అభ‌య్ హ‌త్య ఉదంతాన్ని పోలీసులు చేధించారు. దీని వెనుకున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని తాజాగా మీడియా ముందు ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు వెల్ల‌డించిన ఈ ఉదంతం వివ‌రాలు చూస్తే.. బేగంబ‌జారులో వ్యాపారి కుమారుడు.. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ అభ‌య్‌ ను ఎలా కిడ్నాప్ చేసింది? ఎందుకు కిడ్నాప్ చేసింది? హ‌త్య‌కు కార‌ణ‌మేంది? అస‌లీ ప్లాన్ ఎలా చేశార‌న్న విష‌యాల్ని తాజాగా పోలీసులు వెల్ల‌డించారు.

ఫేస్‌ బుక్‌ లో ప‌రిచ‌య‌మైన ఒక న‌టుడి ద్వారా సినిమా మీద ఆస‌క్తి పెంచుకున్నాడు సాయి. ఈ కుర్రాడిది తూర్పుగోదావ‌రిజిల్లా అన‌ప‌ర్తి మండ‌లానికి చెందిన వాడు. చిన్న చిత‌క ప‌నులు చేసే సాయికి బాగా డ‌బ్బు సంపాదించాల‌ని.. దాంతో సినిమాల్లో న‌టిచాల‌న్న‌ది ఆశ‌. ఇందులో భాగంగా త‌న స్నేహితులైన ర‌వి.. మోహ‌న్ లు క‌లిసి కిడ్నాప్ కు తెర తీశారు. ఈ ఇద్ద‌రూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు.

మార్చి 14న యూట్యూబ్‌ లో ఒక రొమాంటిక్ క్రైమ్ క‌త అనే సినిమాను చూశారు. అందులోని పాత్ర‌ల ప్ర‌భావంతో కిడ్నాప్ డ్రామాకు తెర తీశారు. అయితే.. ఎవ‌రిని కిడ్నాప్ చేయాల‌న్న ఆలోచ‌నలో ఉన్న‌ప్పుడు సాయికి అభ‌య్ గుర్తుకు వ‌చ్చాడు. బాగా ధ‌న‌వంతుడైన అభ‌య్ ను కిడ్నాప్ చేస్తే డ‌బ్బులు చాలా వ‌స్తాయ‌ని వారు భావించారు. అభ‌య్ తెలిసిన వాడు కావ‌టంతో కిడ్నాప్ చేయ‌టం చాలా సులువ‌న్న ఆలోచ‌న‌తో వారీ దారుణానికి తెర తీశారు. అయితే.. ప్లాన్ నిర్వ‌హ‌ణ‌లో తేడా వ‌చ్చి అభ‌య్ కాస్తా ప్రాణాలు కోల్పోయాడు.

ఇక‌.. వీరి కిడ్నాప్ ప్లాన్ ను ఎలా అమ‌లు చేశారో చూస్తే.. మార్చి 16న టిఫిన్ కోసం బైకు మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన అభ‌య్‌ను సాయి లిఫ్ట్ అడిగాడు. అభ‌య్ బైకు న‌డుపుతున్న‌ప్పుడు ఫోన్ రావ‌టంతో.. బైక్‌ ను తాను న‌డుపుతాన‌ని చెప్ప‌టంతో అభ‌య్ ఓకే అన్నాడు. త‌న రూమ్ కి తీసుకెళ్లిన సాయి.. రూమ్‌ లో త‌న స్నేహితుల‌కు ప‌రిచ‌యం చేశాడు. అనంత‌రం కిడ్నాప్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. దీంతో భ‌య‌ప‌డిన అభ‌య్ త‌న త‌ల్లిదండ్రుల్ని ఎన్ని డ‌బ్బులు అడిగినా ఇస్తార‌ని.. త‌న‌ను మాత్రం ఏమీ చేయొద్ద‌ని బ‌తిమిలాడారు. అభ‌య్ చెప్పిన నెంబ‌ర్ల‌ను ఫోన్ చేశారు. అభ‌య్ అరుస్తాడ‌న్న భ‌యంతో అత‌డి ముఖానికి ప్లాస్టర్ వేశారు. హ‌డావుడిలో ఆ ప్లాస్ట‌ర్ ముక్కుకు కూడా వేసేశారు.

దీంతో.. ఊపిరి ఆడ‌క అభ‌య్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. అత‌న్ని అట్ట‌పెట్టెలో ప్యాక్ చేసి.. సికింద్రాబాద్‌ లోని అల్ఫా హోట‌ల్ వ‌ద్ద వ‌దిలేశారు. అనంత‌రం న‌ర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కి వెళ్లిపోయారు. రైలు ఎక్కిన వారు అభ‌య్ త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి రూ.10కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే స్పందించిన పోలీసులు 48 గంట‌ల్లోనే నిందితుల్ని అదుపులోకి తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.