Begin typing your search above and press return to search.

మీకు బిచ్చ‌గాళ్లు క‌నిపించారా? రూ.500 మీదే

By:  Tupaki Desk   |   14 Nov 2017 4:42 AM GMT
మీకు బిచ్చ‌గాళ్లు క‌నిపించారా? రూ.500 మీదే
X
బిచ్చ‌గాళ్లు మీకు క‌నిపించారా? అయితే.. మీ జేబులోకి రూ.500 వ‌చ్చిన‌ట్లే. బిచ్చ‌గాళ్ల‌ను చూస్తేనేరూ.500 వ‌చ్చేస్తాయా? అంటేకాద‌ని చెప్పాలి. కాకుంటే.. బిచ్చ‌గాళ్లు క‌నిపించినంత‌నే జైళ్ల‌శాఖ కంట్రోల్ రూంకు స‌మాచారం అందిస్తే రూ.500 న‌జ‌రానాగా ఇస్తామంటున్నారు.

భాగ్య‌న‌గ‌రిని బెగ్గ‌ర్స్ ఫ్రీ సిటీ (యాచ‌క ర‌హిత న‌గ‌రం)గా మార్చాల‌న్న బృహ‌త్ సంక‌ల్పానికి తెర తీసిన‌ తెలంగాణ జైళ్ల శాఖ ఈ చిత్ర‌మైన ఆఫ‌ర్ ను తెర మీద‌కు తెచ్చింది. అయితే.. ఈ ప్రోగ్రామ్‌ ను వ‌చ్చే నెల (డిసెంబ‌రు) 25 నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

బెగ్గ‌ర్స్ ఫ్రీ సిటీగా మార్చాల‌న్న ల‌క్ష్యంతో ఇప్ప‌టివ‌ర‌కూ 235 పురుషులు.. 125 మంది మ‌హిళ‌ల్ని అదుపులోకి తీసుకొని చంచ‌ల్ గూడ‌.. చ‌ర్ల‌ప‌ల్లి జైళ్ల‌ల్లో ప్ర‌త్యేక శిబిరాల్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. వీరిలో కొంద‌రిని ఆనందాశ్ర‌మాల‌కు కూడా త‌ర‌లించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

అక్టోబ‌రు 20న మొద‌లు పెట్టిన ఈ డ్రైవ్ లో 250 మందిని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌చెప్పిన‌ట్లుగా స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క‌రెక్ష‌న‌ల్ ఆడ్మినిస్ట్రేష‌న్ వైస్ ప్రిన్సిప‌ల్ సంప‌త్ చెబుతున్నారు. తాము అదుపులోకి తీసుకున్న యాచ‌కులకు కౌన్సెలింగ్ ఇవ్వ‌టంతో పాటు.. వారి వేలిముద్ర‌లు.. ఆధార్ నంబ‌ర్లు సేక‌రించామ‌ని.. వారు మ‌ళ్లీ యాచ‌క వృత్తిలోకి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

తాము అదుపులోకి తీసుకున్న బిచ్చ‌గాళ్ల‌లో నైపుణ్యాల్ని గుర్తిస్తే.. వారికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇప్పించి.. ఆ వృత్తిలో వారు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు. ఇప్ప‌టికే కొంద‌రిని పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఇవాంకా ట్రంప్ వ‌స్తున్న వేళ‌.. బిచ్చ‌గాళ్ల‌ను అదుపులో తీసుకుంటుంటే.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో బెగ్గ‌ర్స్ ఫ్రీ సిటీ కార్య‌క్ర‌మాన్ని వచ్చే నెల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు చెబుతున్నారు.