Begin typing your search above and press return to search.

ఆ పాప బర్త్ డే ను సెలబ్రేట్ చేసిన హైదరాబాద్ సీపీ

By:  Tupaki Desk   |   29 April 2020 3:30 AM GMT
ఆ పాప బర్త్ డే ను సెలబ్రేట్ చేసిన హైదరాబాద్ సీపీ
X
కరోనా కష్టకాలంలో ఒక్కొక్కళ్లకు ఒక్కో కష్టం. కలలో కూడా ఊహించని పరిణామాలతో ఎంతోమంది వేసుకున్న ఏన్నో ప్లాన్లు మటాష్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. కొందరి ఆశల్ని.. ఆకాంక్షల్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వ సిబ్బంది.. పోలీసు యంత్రాంగం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోవకే వస్తుంది తాజాగా హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ చేసిన పని. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పురాలో ఉంటోంది ఏడాది వయసున్న మైరా అనే చిన్న పాప.

ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని బోస్టన్ లో ఉన్నారు. పాప ఏమో తాతయ్య.. నానమ్మల వద్దే ఉండిపోయింది. కరోనా నేపథ్యంలో వారు ఇక్కడకు రాలేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఎంతో ఘనంగా చేద్దామనుకున్న తమ పాప ఫస్ట్ బర్త్ డేకు కనీసం కేక్ కూడా కట్ చేయించలేకపోయామన్న వేదనలో వారున్నారు. ఇలాంటివేళ.. తమ పాప మొదటి పుట్టినరోజును జరిపించగలరా? అంటూ హైదరాబాద్ పోలీసులకు మైరా తల్లిదండ్రులు కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. కేక్ తయారు చేయించటమే కాదు.. పాపకు టెడ్డీబేర్ ను బహుమతిగా తీసుకొని పాప ఇంటికి వెళ్లారు. పాప చేత కేక్ కట్ చేయించి చిన్నపాటి వేడుక చేశారు. దీనికి మైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ తో పాటు.. ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్.. సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ తదితర అధికారులు హాజరయ్యారు. తమ పాప పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించేందుకు పోలీసు బాసులు తమ ఇంటికే రావటంతో ఆమెకుటుంబీకులంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లాక్ డౌన్ లోటు తీరి పోయిందంటున్నారు.

ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలోని ఒక పెద్దావిడ 60 ఏళ్ల పుట్టినరోజు వేడుకల్ని పోలీసులే చేయించారు. ఆమె కుటుంబ సభ్యులంతా అమెరికాలోనే ఉండి పోవటంతో.. వారి కోరికను పోలీసులు తీర్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుకు తగ్గట్లే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.