Begin typing your search above and press return to search.

ఈ రోజు నుంచే;హెల్మెట్ లేకుంటే ఫైన్ ప్లస్ జైలు

By:  Tupaki Desk   |   2 March 2016 4:48 AM GMT
ఈ రోజు నుంచే;హెల్మెట్ లేకుంటే ఫైన్ ప్లస్ జైలు
X
హైదరాబాద్ నగర వాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద సమస్యలోనే చిక్కుకునే అవకాశం ఉంది. హెల్మెట్ పెట్టుకోకుండా అజాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి టూ వీలర్ మీద వెళుతుంటే అడ్డంగా బుక్ అయినట్లే. హెల్మెట్.. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేయటంతోపాటు.. ఈ రెండు లేకుండా జరిమానా కమ్ జైలు శిక్షను ఈ రోజు నుంచే విధించనున్నారు.

ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనలతో తాజా శిక్షలు అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఈ రోజు (బుధవారం) నుంచి హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే ఫైన్ విధించటంతో పాటు.. తొలిసారి పట్టుబడితే రెండు రోజులు.. రెండోసారి పట్టుబడితే నాలుగు రోజుల పాటు నాలుగు రోజుల జైలుశిక్ష.. మూడోసారి పట్టుబడితో జరిమానాతో పాటు.. వారం పాటు జైలుశిక్ష విధించనున్నారు. ఈ డ్రైవ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో.. వాహనాన్ని నడిపే వారు హెల్మెట్ తో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పనిసరిగా తమతో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వాహనం నడిపే వారు మాత్రమే కాదు.. వాహన యజమానులు సైతం.. తమ వాహనాలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అన్న విషయాన్ని చూసుకొనే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అడ్డంగా బుక్ కావటమే కాదు.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన దుస్థితి ఎదురవ్వటం ఖాయం. బీకేర్ ఫుల్.