Begin typing your search above and press return to search.

సౌదీలో న‌ర‌కం చూస్తున్న హైద‌రాబాదీ డాక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:50 AM GMT
సౌదీలో న‌ర‌కం చూస్తున్న హైద‌రాబాదీ డాక్ట‌ర్‌
X
ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఒక వైద్యుడు న‌ర‌కం చూస్తున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌ని చేసినందుకు జీతం ఇవ్వ‌క‌పోగా.. స్వ‌దేశానికి వెళ్లిపోతానంటే నో అంటే నో అనేస్తున్న వైనం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సౌదీలో చిక్కుకుపోయిన త‌న డాక్ట‌ర్ భ‌ర్త‌ను భార‌త్‌కు తీసుకువ‌చ్చేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయాన్ని కోరారు వైద్యుడి స‌తీమ‌ణి ప‌విత్ర‌.

హైద‌రాబాద్‌కు చెందిన అనిల్ అనే వ్య‌క్తి 2012లో సౌదీకి వెళ్లాడు. అక్క‌డ అలీ డెంటోఫ్లాస్ట్ సెంట‌ర్ లో అర్థోడెంటిస్ట్ గా ప‌ని చేస్తున్నారు. 2014లో అనిల్ త‌న ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. ఇదికాస్తా 2016లో పూర్తి అయ్యింది. అయితే.. అనిల్ ను హైద‌రాబాద్‌ కు పంపటానికి ఆసుప‌త్రి యాజ‌మాన్యం స‌సేమిరా అంటోంది.

అంతేకాదు.. ఆత‌గాడికి ఐదు నెల‌లుగా జీతం ఇవ్వ‌కుండా చుక్క‌లు చూపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న భ‌ర్త ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అనిల్ స‌తీమ‌ణి ప‌విత్ర కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ ను సాయం కోరారు. ఫ్రీగా వైద్యం చేయ‌టం లేద‌ని కొంద‌రు పేషెంట్లు క్లినిక్ పై కేసు పెట్టార‌ని.. అది తేలే వ‌ర‌కూ హైద‌రాబాద్‌ కు పంపించేది లేదంటూ భ‌య‌పెడుతున్నార‌ని.. గ‌డిచిన ఐదు నెల‌లుగా జీతం కూడా ఇవ్వ‌టం లేద‌ని ప‌విత్ర వాపోయింది. దీనికి స్పందించిన సుష్మా స్వ‌రాజ్ త‌న‌కు వివ‌రాలు వెంట‌నే పంపాల‌ని.. సౌదీలోని రాయ‌బార కార్యాల‌యం ద్వారా త‌గిన సాయం చేస్తామ‌ని ఆభ‌య‌మిచ్చారు.