Begin typing your search above and press return to search.

లాజిక్‌తో కొట్టిన అంజ‌న్ కుమార్‌..!

By:  Tupaki Desk   |   7 Jan 2022 7:30 AM GMT
లాజిక్‌తో కొట్టిన అంజ‌న్ కుమార్‌..!
X
సికింద్రాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అంజ‌న్ కుమార్ యాద‌వ్ త‌న‌ స‌మ‌య‌స్ఫూర్తిని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశంలో త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. త‌న వాద‌న‌ల‌తో అస‌మ్మ‌తి వాదుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేలా చేశారు. దీంతో పార్టీలోని ఒక వ‌ర్గం అంజ‌న్ కుమార్‌ను ప్ర‌శంసించింది.

రెండు రోజుల క్రితం జూమ్ యాప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ భేటీ జ‌రిగింది. ఇందులో ప‌లువురు నేత‌లు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. పార్టీలో ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని.. నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం లేద‌ని.. ఆయా జిల్లాల ఇన్‌చార్జుల అభిప్రాయాలు తీసుకోకుండానే ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని.. పార్టీ ఎదుగుదల కంటే సొంత ఇమేజీ పైనే రేవంత్ ఫోక‌స్ పెడుతున్నార‌ని పార్టీ నేత‌లు విమ‌ర్శించారు.

ముఖ్యంగా.. మొద‌టి నుంచీ రేవంత్ అంటే ప‌డ‌ని పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నాడ‌ని.. త‌న‌కు తానే హీరో అనుకుంటున్నాడ‌ని.. అలాంట‌పుడు హుజూరాబాద్‌లో కేవ‌లం మూడు వేల ఓట్లే ఎలా వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించారు. పార్టీకి హీరోలు అంటే సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలేన‌ని తామంతా జీరోల‌మేన‌ని చెప్పుకొచ్చారు.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఎర్ర‌వ‌ల్లిలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని ఏక‌ప‌క్షంగా ఎలా ప్ర‌క‌టిస్తార‌ని మండిప‌డ్డారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకే చెందిన మాజీ మంత్రి గీతారెడ్డి కూడా రేవంత్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పు ప‌ట్టారు. అంద‌రినీ క‌లుపుకొని పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేల్చి చెప్పారు. ఇలా ఈ స‌మావేశం వాడివేడిగా జ‌రిగింది. రేవంత్ అనుకూల, వ్య‌తిరేక వ‌ర్గాలుగా విడిపోయి ఎవ‌రికి వారు వాదోప‌వాదాలు చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ మ‌రో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అంజ‌న్ కుమార్ యాద‌వ్ క‌ల్పించుకొని త‌న వాద‌న‌లు వినిపించి స‌మావేశాన్ని శాంత‌ప‌రిచారు. కొన్ని కార్య‌క్ర‌మాలు అనుకోకుండా అప్ప‌టిక‌ప్పుడు తీసుకోవాల్సిన అవ‌సరం ఉంటుంద‌ని.. ఈ విష‌యంలో రేవంత్‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌పుడు జిల్లా ఇన్‌చార్జుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని అనుకుంటే.. మ‌రి హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు ఎవ‌రు స‌మాచారం ఇస్తున్నార‌ని అంజ‌న్ ప్ర‌శ్నించారు.

దీంతో అవాక్క‌వ‌డం నేత‌ల వంతైంది. అంజ‌న్ అభిప్రాయంతో కొంద‌రు అప్ప‌టిక‌ప్పుడు మౌనం వ‌హించ‌గా.. మ‌రికొంద‌రు నేత‌ల‌ను పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ శాంత‌ప‌రిచార‌ట‌. ఇలా అంజ‌న్ కుమార్ యాద‌వ్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారట‌.