Begin typing your search above and press return to search.

నిప్పుల కొలిమిగా హైదరాబాద్.. పదేళ్లలో ఇదే తొలిసారి.. మరో 5 రోజులు ఇలానే!

By:  Tupaki Desk   |   29 March 2022 3:00 AM GMT
నిప్పుల కొలిమిగా హైదరాబాద్.. పదేళ్లలో ఇదే తొలిసారి.. మరో 5 రోజులు ఇలానే!
X
మార్చి పూర్తి కాలేదు. ఉగాది ఇంకా రాలేదు. ఏప్రిల్ మధ్యలో కానీ.. ఆ తర్వాత కానీ తన ప్రతాపాన్ని చూపించాల్సిన సూరీడు చెలరేగిపోతున్నాడు. భానుడి భగభగలతో తెలుగు ప్రాంతాల ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి పూర్తి కాక ముందే ఎండలు మంటెత్తుతున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గడిచిన పదేళ్లలో మార్చిలో ఈ స్థాయి ఎండలు ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత విషయంలో సరికొత్త రికార్డును క్రియేట్ అవుతోంది.

హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాలు భానుడి భగభగలతో ఠారెత్తిపోతున్న పరిస్థితి. సోమవారం పగటి ఉష్ణోగ్రతలు చూస్తే.. అదిలాబాద్ జిల్లాలో ఏకంగా 43 డిగ్రీలు నమోదు అయితే.. హైదరాబాద్ లోనూ ఫార్టీ టచ్ అయిన పరిస్థితి. మార్చి నెలలో ఎండలు ఉండవని చెప్పట్లేదు కానీ.. ఈ స్థాయిలో మాత్రం ఉండని పరిస్థితి. అందుకు భిన్నంగా మార్చి ఉష్ణోగ్రతల్లో సరికొత్త రికార్డుగా వాతావరణ శాఖ చెబుతోంది.

2016 మార్చి 18న భద్రాచలంలో 42.8, 2017 మార్చి 31న ఆదిలాబాద్ లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయితే.. ప్రస్తుతం మార్చిలోనే 43 డిగ్రీలకు చేరుకోవటం చూస్తే.. రానున్న రోజుల్లో మరింత మంట ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ ఇంత వేడి ఎందుకు? ఎండలు ఎందుకు మండుతున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. రెండు మూడు కారణాల్ని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతున్నందున ఎండల వేడి పెరిగినట్లుగా పేర్కొన్నారు.

ఎండ తీవ్రత కారణంగా నల్గొండలో గాలిలో తేమ సాధారణం కంటే 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు వేసవిలో కురుస్తుంటాయి. వీటిని వాతావరణ శాఖ అధికారులు కాలా బైశాఖీలుగా పేర్కొంటారు. ఈసారి వేసవిలో కాలా బైశాఖీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మండే ఎండలు రానున్న మరో ఐదు రోజుల పాటు ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రానున్న ఐదు రోజుల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావటం ఖాయమంటున్నారు. సో.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బీకేర్ ఫుల్.