Begin typing your search above and press return to search.

గ్యాంగ్ రేప్ లో ఆరోపణలున్న ఎమ్మెల్యే కొడుకుపై కేసుకు మరిన్ని రోజులు!

By:  Tupaki Desk   |   7 Jun 2022 4:26 AM GMT
గ్యాంగ్ రేప్ లో ఆరోపణలున్న ఎమ్మెల్యే కొడుకుపై కేసుకు మరిన్ని రోజులు!
X
దాదాపు పది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరంలో జరిగిన దారుణ గ్యాంగ్ రేప్ ఉదంతం మూడు నాలుగు రోజుల క్రితమే బయటకు రావటం తెలిసిందే. ఈ దారుణ ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి.. సంచలనంగా మారింది.

పబ్ కు వచ్చిన మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి.. కారులో ఎక్కించుకొని ఆమెపై సామూహిక అత్యాచార ఘటనలో పాతబస్తీకి చెందిన ఒక ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం.. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం తెలిసిందే.

తొలుత అతని పాత్ర ఏమీ లేదని పోలీసులు చెప్పినా.. ఆ తర్వాత వెల్లడైన వివరాలు.. బయటకు వస్తున్న అంశాల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే కొడుకు మీదా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితమే అతడి మీద కేసు నమోదు చేయాలని.. ఏ6గా అతని పేరును చేర్చాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. దీనికి సంబంధించిన ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.

తాజాగా బయటకు వచ్చి.. భారీగా వైరల్ అయిన వీడియోలో సదరు ఎమ్మెల్యే కుమారుడు ఉండటం.. దీంతో అతడిపై చర్యలు ఎందుకు తీసుకోరు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కాస్త రాజకీయ రగడగా మారిన నేపథ్యంలో పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే కొడుకు మీద చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు వివరాలు బయటకు వెల్లడించటం లేదు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వెను వెంటనే సదరు ఎమ్మెల్యే కొడుకు మీద చర్యలు ఉండవన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాల్ని సేకరించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే కొడుకు మీద న్యాయ సలహా తీసుకున్న తర్వాతే చర్యలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే కొడుకు మీద తదుపరి చర్యలకు మరికాస్త టైం పడుతుందనే మాట వినిపిస్తోంది.