Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయి ప్రాణం తీసిన ‘పబ్’.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   9 Nov 2020 6:00 PM GMT
ఆ అమ్మాయి ప్రాణం తీసిన ‘పబ్’.. అదెలానంటే?
X
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం ఎంత ప్రమాదకరమన్న విషయం తెలిసినప్పటికీ.. ఉడుకురక్తంతో చేసే తప్పులు ప్రాణాల మీదకు తెస్తున్న పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా బయటకొచ్చిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. మద్యం మత్తు.. మరోవైపు వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి.. చెట్టును ఢీ కొన్న ఘటనలో ఆ అమ్మాయి మరణిస్తే.. అబ్బాయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంచలనంగా మారిన ఈ ప్రమాద వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల ప్రియాంక జార్జియాలో మెడిసిన్ చదువుతోంది. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ కు వచ్చింది. తాజాగా ఆదివారం ఫ్రెండ్ ను కలిసేందుకు బయటకు వచ్చిన ఆమె.. తన స్నేహితుడు మిత్తి మోడీతో కలిసి పబ్ కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన వారు బంజారాహిల్స్ నుంచి లింగంపల్లి వైపునకువెళుతున్న వేళ.. హెచ్ సీయూ గేట్ నెంబరు 2 వద్ద చెట్టును ఢీ కొట్టారు.

ఈ ఘటనలో ప్రియాంక అక్కడికక్కడే మరణించగా.. మిత్తి మోడీ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మిత్తి మోడీకి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు జరపగా 45 శాతం నమోదైంది. పబ్ లో మద్యం సేవించి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదుచేశారు. సదరుయువకుడు వైజాగ్ లో చదువుతున్నాడని.. ఒక ప్రముఖ వ్యాపారి కుమారుడిగా చెబుతున్నారు. హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు? అన్నది ప్రశ్నగా మారింది. ప్రమాదానికి గురైన కారు కూడా ఖరీదైన కారు కావటం గమనార్హం.