Begin typing your search above and press return to search.

నేరెళ్ల బాధితుల‌కు వైద్యం వారితోనే చేయాల‌న్న హైకోర్టు

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:46 AM GMT
నేరెళ్ల బాధితుల‌కు వైద్యం వారితోనే చేయాల‌న్న హైకోర్టు
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి నేరెళ్ల ఇష్యూపై హైకోర్టు ఆస‌క్తిక‌ర ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల చిత్ర హింస‌ల‌తో గాయ‌ప‌డిన గ్రామ‌స్థుల‌కు వైద్యం అందించేందుకు వ‌రంగ‌ల్ జిల్లా ఎంజీఎం ఆసుప‌త్రి నుంచి ఇద్ద‌రు వైద్యుల్ని పంపి మెరుగైన వైద్య‌సేవ‌లు అందించాల‌ని కోర్టు ఆదేశించింది.

ప్ర‌స్తుతం ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు గ్రామ‌స్థుల గాయాల‌ను ప‌రీక్షించి.. గాయాల తీవ్ర‌త‌ను తెలుసుకోవాల‌ని సూచ‌న చేసింది. అవ‌స‌ర‌మైతే బాధితుల‌ను నిమ్స్ కు త‌ర‌లించాలంటూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిని ఆదేశించింది.

నేరెళ్ల ఇష్యూపై సీబీఐతో కానీ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందంతో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ పౌర‌హ‌క్కుల సంఘం అధ్య‌క్షుడు గ‌డ్డం ల‌క్ష్మ‌ణ్ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌నం వ్యాజ్యంపై అత్య‌వ‌ర‌స‌రంగా భోజ‌న విరామ స‌మ‌యంలో విచార‌ణ చేప‌ట్టాల‌న్న అభ్య‌ర్థ‌న‌తో హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్‌.. జ‌స్టిస్ జె. ఉమాదేవిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున ర‌ఘునాథ్ త‌న వాద‌న‌ను వినిపించారు.

"తంగళ్లపల్లి వాగు నుంచి రోజుకు దాదాపు 200 వరకు ఇసుక లారీలు నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల ద్వారా వెళ్తుంటాయి. ఇటీవల ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో నేరెళ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో జులై 4న రాత్రి 11 గంటలు త‌ర్వాత సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన 8 మందిని తీసుకెళ్లి థర్డ్‌ డిగ్రీ పద్ధతులను ప్రయోగించారు. రబ్బరు లాఠీలతో కొట్టారు. కరెంట్‌ షాక్‌ ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు. మర్మాంగాలను తీవ్రంగా గాయపరచడంతో పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ స్వయంగా బాధితులను కొట్టారు. ఈ విషయాన్ని బయటికి వెల్లడిస్తే కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. పోలీసులు జులై 4న గ్రామస్థులను తీసుకెళ్లినప్పటికీ కోర్టులో హాజరుపరచలేదు. చివరికి ఆందోళనకు దిగడంతో జులై 8న కోర్టులో హాజరపరిచారు. కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది. అయితే గాయాలకు సంబంధించి వైద్యుల ధ్రువీకరణ ఇస్తేనే అనుమతిస్తామని జైలు సూపరింటెండెంట్‌ చెప్పడంతో పోలీసులు డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఇప్పంచారన్నారు. గాయాల తీవ్రత నేపథ్యంలో వైద్యులు కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రికి పంపి చికిత్స అందించారు. తరువాత వేములవాడ విడిచి వెళ్లరాదంటూ షరతులతో కూడిన బెయిలు మంజూరైంది. దీంతో బాధితుల్లో ఆరుగురు అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు" అని పేర్కొన్నారు.

ఈ వాద‌న‌ల‌పై అడ్వొకేట్‌ జనరల్‌ డి.ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. గాయాలకు సంబంధించి పిటిషనర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నందున వారికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తామన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ముందు ఎంజీఎం సీనియర్‌ డాక్టర్లు ఇద్దరిని బాధితుల వద్దకు పంపి గాయాల తీవ్రతను నమోదు చేయాలని, మెరుగైన వైద్యం అవసరమని భావిస్తే హైదరాబాద్‌ లోని నిమ్స్‌కు తరలించాలని పేర్కొంది. బాధితుల గాయాల తీవ్రతపై నివేదికను సమర్పించాలని వైద్యులను ఆదేశించింది.