Begin typing your search above and press return to search.

టీ రవాణా శాఖకు హైకోర్టు మొట్టికాయ

By:  Tupaki Desk   |   7 Sep 2015 10:00 AM GMT
టీ రవాణా శాఖకు హైకోర్టు మొట్టికాయ
X
కోట్లాదిమంది ప్రజలపై తక్షణమే ప్రభావం చూపించే అంశాల మీద ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తరచూ న్యాయస్థానాల చేత మొట్టికాయలు వేయించుకోవటం తెలంగాణకు చెందిన పలు శాఖలకు ఓ అలవాటుగా మారింది. ఇప్పుడా జాబితాలో తెలంగాణ రవాణా శాఖ చేరింది.

పదిహేను రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు వాడాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన పిటీషన్ దారుకు ఊరటనిస్తూ.. రవాణా శాఖ ఇచ్చిన నిర్ణయంపై స్టే మంజూరు చేసింది.

మొదట.. హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహనను పెద్ద ఎత్తున చేపట్టిన తర్వాత హెల్మెట్ల వినియోగం తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా మొదట 15 రోజుల పాటు.. హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని అమలు చేయాలన్న కోర్టు.. రవాణా శాఖ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా తప్పు పట్టింది.

ఎవరైనా వాహనదారుడు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ కొనాలన్న నిర్ణయంలోనూ అర్థం లేదని పేర్కొంది. మొదట హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించిన తర్వాత ఈ అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పిన తీరుతో అయితే.. ఎడాపెడా తీసుకునే నిర్ణయాల్నిఆపేస్తారో లేదో చూడాలి.