Begin typing your search above and press return to search.

ఈజీ మూవీస్ అలాంటి ప‌ని చేస్తుందా?

By:  Tupaki Desk   |   11 March 2018 4:24 AM GMT
ఈజీ మూవీస్ అలాంటి ప‌ని చేస్తుందా?
X
డిజిట‌ల్ కాలం. ప‌ని ఏదైనా చేతిలో ఉన్న మొబైల్ తో పూర్తి చేసేస్తున్నారు. యాప్ ల్ని డౌన్ లోడ్ చేసుకోవ‌టం.. ప‌ని చేయ‌టం ఇదే ఇప్ప‌టి ట్రెండ్‌. ఈ జోరులో చ‌ట్టంతో కొంద‌రు వ్యాపారం చేసేస్తున్నారా? అంటే అవున‌నే ప‌రిస్థితి. ఆన్ లైన్ లో సినిమా టికెట్లుకొన‌టం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ‌మైన అంశం. అయితే.. చ‌ట్ట‌ప‌ర‌మైన అనుమ‌తులు తీసుకోకుండా.. ప్ర‌భుత్వానికి ప‌న్నులు చెల్లించ‌కుండా అమ్మాల్సిన దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వ‌సూలు చేస్తున్న ఒక సంస్థ‌పై న‌మోదైన కేసును కొట్టేయ‌టానికి హైకోర్టు నో చెప్ప‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మే ముఖ్య‌మైన సంస్థ‌ల్లో ఈజీ మూవీస్ ఒక‌టి. అయితే.. ఈ సంస్థ ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండానే ఎక్కువ రేట్ల‌కు సినిమా టికెట్లు అమ్మేస్తుంద‌న్న ఫిర్యాదు సైఫాబాద్ పోలీసులకు అందింది. దీనిపై కేసు న‌మోదు చేశారు. దీనికి సంబంధించిన కేసు విచార‌ణ తాజాగా హైకోర్టులో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌మ‌పై న‌మోదు చేసిన కేసును కొట్టేయాల‌ని ఈజీ మూవీస్ కోరింది. ఇందుకు హైకోర్టు నో చెప్ప‌టం గ‌మ‌నార్హం.

జీఎల్ న‌ర‌సింహ‌రావు అనే లాయ‌ర్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు న‌మోదైంది. థియేట‌ర్ల‌లో రూ.50 టికెట్ ను రూ.58.02 వ‌సూలు చేయ‌టంపై ప్ర‌శ్నిస్తే.. ఇంట‌ర్ నెట్ నిర్వాహ‌కులు.. థియేట‌ర్ య‌జ‌మానులు స్పందించటం లేదు. దీంతో స‌ద‌రు లాయ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్‌.. ప్ర‌భుత్వ అధికారుల్ని క‌లిసి వివ‌రాలు కోర‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈజీ మూవీస్ కు ఆన్ లైన్లో అమ్మేందుకు ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌న్న విష‌యం వెల్లడైంది. న‌గ‌ర శివారులో ఉన్న థియేట‌ర్ల‌ను మ‌భ్య పెట్టి 40 శాతం టికెట్ల‌ను అమ్ముకోవ‌టానికి ఒప్పందాలు చేసుకుందని తేలింది.

హైద‌రాబాద్ లోని మొత్తం 70 థియేట‌ర్ల‌లో 50 థియేట‌ర్ల‌లో టికెట్లు అమ్ముకోవ‌టానికి ఈజీ మూవీస్ ఒప్పందాలు చేసుకుంది. అమ్మాల్సిన ధ‌ర కంటే ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్న ఈజీమూవీస్.. పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతోందని తేలింది. ఏడాదికి స‌గ‌టున రూ.11.52 కోట్ల వ‌ర‌కూ టికెట్ల అమ్మ‌కాలు చేస్తుంద‌న్న‌ విష‌యం విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ మొత్తానికి ఎలాంటి ప‌న్ను ప్ర‌భుత్వానికి చెల్లించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఈ విష‌యాల్ని విచార‌ణ‌లో గుర్తించిన హైకోర్టు..ఈజీ మూవీస్ పై న‌మోదైన కేసును కొట్టివేయ‌టానికి నిరాక‌రించింది.