Begin typing your search above and press return to search.

‘స్టే’ తొలగి కేసీఆర్ సర్కారుకు ఊరట

By:  Tupaki Desk   |   4 Jan 2017 6:22 AM GMT
‘స్టే’ తొలగి కేసీఆర్ సర్కారుకు ఊరట
X
చూస్తూ.. చూస్తూ ప్రతిపక్షాలు పైచేయి సాధించటాన్ని ఏ అధికారపక్షానికి ఇష్టం ఉండదు. అందులోకి తాను ప్రతిష్ఠాత్మకంగా ఫీలైన అంశంపై కోర్టు ఆంక్షలు పెడితే.. ఆ ప్రభుత్వానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది తెలంగాణ సర్కారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ గా తీసుకొని చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిచేలా చెన్నైలోని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వటం తెలిసిందే. పాలమూరును టీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. ఈ పథకం అమలును తెలంగాణ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ పథకం అమలును న్యాయపరంగా అడ్డుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా.. దీనికి బ్రేకులు వేస్తూ.. ఉమ్మడి హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో తాము అనుకున్న రీతిలో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయన్న వేదనను వ్యక్తం చేస్తున్న తెలంగాణ అధికారపక్షానికి తాజా ఉత్తర్వులు ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పక తప్పదు.

నల్గొండ.. మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని కరవు.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందించటం కోసం తల పెట్టిన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వవాదనను వినకుండా ఏకపక్షంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేయటం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం వాదనలు వినిపించుకోవటానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వలేదని.. అందుకు తగిన కారణాల్ని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ చూపలేదంటూ ధర్మాసనం తప్పు పట్టటం గమనార్హం.

గ్రీన్ ట్రిబ్యూనల్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటీషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వం తలపెట్టినప్రాజెక్టుల్నిఅడ్డుకోవటం కోసం.. రాజకీయ కారణాలతోనే ఈ వ్యాజ్యాన్ని వేసినట్లుగా ప్రభుత్వ ఏజీ వాదించారు. ఈ పథకంపై దాఖలైన అన్ని వ్యాజ్యాల్లోనూ పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరేనని వివరించారు. ఈ దశలో కల్పించుకున్న ఏసీజే.. ఏజీవాదనలకు అడ్డు చెబుతూ.. ఎవరి తరఫునైనా ఒక న్యాయవాదిగా కేసులు వేసే స్వేచ్ఛ ఏ న్యాయవాదికైనా ఉంటుందని.. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చకూడదంటూ హితవు పలికారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్ని నిలుపు చేస్తూ స్టే ఇచ్చింది. అదే సమయంలో ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. కొన్ని పరిమితులు విధించింది. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా కరవు.. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తాగునీటిని అందించే ప్రాజెక్టుల నిర్మాణాలకే ప్రభుత్వం కట్టుబడి ఉండాలని.. అందుకు తగ్గట్లు అనుమతులు పొందాలని స్పష్టం చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/