Begin typing your search above and press return to search.

‘జడ్జి’ల మీద కొరడా విదిల్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   28 Jun 2016 5:04 AM GMT
‘జడ్జి’ల మీద కొరడా విదిల్చిన హైకోర్టు
X
తమకు న్యాయం జరగలేదంటూ దాదాపు 120 మంది జడ్జిలు రోడ్ల మీదకు రావటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జడ్జిల తీరుపై కన్నెర్ర చేసింది. జడ్జిలను కూడగట్టుకొని వీధుల్లోకి వచ్చేలా చేసినట్లుగా భావిస్తున్న తెలంగాణ జడ్జిల అసోసియేషన్ అధ్యక్ష.. కార్యదర్శులపై వేటు వేస్తూ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలతో ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. క్రమశిక్షణ తీసుకుంటున్నట్లుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే నిరసనలు పెల్లుబికాయి.

నాంపల్లి కోర్టులో 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్న కె.రవీందర్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కోర్టులో 14వ అదనపు మెట్రపాలిటన్ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్న వి. వరప్రసాద్ లను సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవటంతో పాటు.. ఏపీ సివిల్ సర్వీసు కింద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లుగా పేర్కొనటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు.. సస్పెండ్ చేసిన వారు నిర్వహిస్తున్న బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్నవిషయాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్లకు గురైన జడ్జిలు నిబంధనల మేర అలవెన్సులు పొందొచ్చని.. సస్పెన్షన్ కాలంలో వారు ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి పెట్టి వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.

తాజా పరిణామాలతో హైకోర్టు విభజన.. న్యాయాధికారుల ఆప్షన్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన మరో రూపు దాల్చిందని చెప్పొచ్చు. దేశ చరిత్రలోనే తొలిసారిగా జరిగినట్లుగా చెబుతున్నా జడ్జిల నిరసనపై హైకోర్టు తీవ్రంగా పరిగణించటంతో పాటు.. రెండు వారాల క్రితం లాయర్లతో జడ్జిలు సమావేశం కావటం ఏపీ సివిల్ సర్వీసు నిబంధనల ప్రకారం రూల్స్ ను ఉల్లంఘించటంగా ఉన్నతస్థాయి వర్గాలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్ష.. కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న రవీందర్ రెడ్డి.. వరప్రసాద్ లను సస్పెండ్ చేయటానికి కారణాల్ని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనలేదని తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలపై తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తాయి.

తాజా సస్పెన్షన్ ఆదేశాల్ని నిరసిస్తూ పురానీ హవేలీలోని సిటీ సివిల్ కోర్టు ముందు న్యాయవాదులు నిరసన నిర్వహించగా.. తిరుమలరావు అనే న్యాయవాది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వైనం సంచలనంగా మారింది. నిరసనలో పాల్గొన్న ఆయన ఉన్నట్లుండి పెట్రోల్ మీద పోసుకోవటం.. పెట్రోల్ కాస్తా చెవులు.. కళ్లలోకి పోవటంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వరుసగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జడ్జిల సంఘం అత్యవసరంగా భేటీ కావాలంటూ నిర్ణయించారు. ఈరోజు (మంగళవారం) ఈ సమావేశం జరగనుంది.