Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డి ఇష్యూలో హైకోర్టు జోక్యం చేసుకుందిగా!

By:  Tupaki Desk   |   2 Feb 2019 10:01 AM GMT
శ్రీ‌రెడ్డి ఇష్యూలో హైకోర్టు జోక్యం చేసుకుందిగా!
X
తెలుగు రాష్ట్రాల్లో గ‌తేడాది హాట్ టాపిక్ గా నిలిచిన‌ వాటిలో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఒక‌టి. టాలీవుడ్ లో మ‌హిళా క‌ళాకారుల‌పై జ‌రుగుతున్న లైంగిక దోపిడీకి తానే నిద‌ర్శ‌న‌మంటూ వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డి రోడెక్క‌డం.. ఆమెకు మ‌ద్ద‌తుగా కొంద‌రు - వ్య‌తిరేకిస్తూ మ‌రికొంద‌రు గ‌ళ‌మెత్త‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ప‌లువురు బ‌డా సినీ తార‌ల పేర్లూ అందులో వినిపించ‌డంతో జనం నివ్వెర‌పోయారు. ఆపై కొద్దికొద్దిగా అంద‌రూ ఈ వ్య‌వ‌హారంపై సైలెంట్ అయ్యారు.

తాజాగా మ‌రోసారి క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. కార‌ణం.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు. టాలీవుడ్‌ లో మ‌హిళా క‌ళాకారుల‌పై లైంగిక దోపిడీని అడ్డుకోవాలంటూ మహిళా సంఘం నేత సంధ్యారాణితోపాటు పలువురు దాఖలు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచారించింది. లైంగిక దోపిడీకి అడ్డుక‌ట్ట వేసే దిశ‌గా ఉన్న‌త స్థాయి క‌మిటీని ఏర్పాటుచేయాలంటూ పిటిష‌నర్లు చేసిన విన‌తిని ఆమోదించింది. క‌మిటీ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ‌ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు శుక్ర‌వారం ఆదేశించింది.

ప్ర‌భుత్వం ఏర్పాటుచేసే క‌మిటీలో మహిళా - శిశు సంక్షేమ‌శాఖ‌ - హోం శాఖల‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌తోపాటు ప‌లువురు మహిళా సంఘాల నేతలు - మహిళా లాయర్లు - సినీరంగానికి చెందిన ప‌లువురు మహిళా కళాకారులు ఉండే అవ‌కాశ‌ముంది. క‌మిటీ ఏర్పాటు విష‌యంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయడానికి త‌మ‌కు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టును కోరారు. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక దోపిడీకి అడ్డుక‌ట్ట వేసే దిశ‌గా అడుగులు ప‌డ్డ‌ట్లేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌మిటీ ఏర్పాటుచేసే విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గొద్ద‌ని.. స్త్రీల‌ భ‌ద్ర‌త‌లో చిత్త‌శుద్ధిని చాటుకోవాల‌ని మహిళా సంఘాల నేత‌లు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.