Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ను షేక్ చేస్తున్న ఐటీ ఉద్యోగి ఎంతమందిని కలిశాడు?

By:  Tupaki Desk   |   4 March 2020 5:30 AM GMT
హైదరాబాద్ ను షేక్ చేస్తున్న ఐటీ ఉద్యోగి ఎంతమందిని కలిశాడు?
X
ఇప్పటిదాకా సినిమాల్లో మాత్రమే.. ఒక మహానగరాన్ని ఒక్కడు వణికిస్తుంటాడు. కొవిడ్ వైరస్ పుణ్యమా అని ఇప్పుడు ఒక ఐటీ ఉద్యోగి పుణ్యమా అని హైదరాబాద్ మహానగరం వణికిపోయే పరిస్థితి. ఉద్యోగంలో భాగంగా హాంకాంగ్ వెళ్లిన ఐటీ ఉద్యోగి దుబాయ్ మీదుగా బెంగళూరుకు విమానంలో రావటం.. బస్సులో హైదరాబాద్ చేరుకోవటం తెలిసిందే.

చివరకు అతగాడికి కొవిడ్ వైరస్ బారిన పడినట్లుగా పరీక్షల్లో నిరూపణ కావటంతో అతగాడు ఎవరెవరిని కలిశాడు? ఎంతమందికి టచ్ అయ్యాడన్న విషయాన్ని రివర్స్ ఇంజనీరింగ్ మోడ్ లో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కొవిడ్ వైరస్ సోకటానికి ముందు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అతగాడి కారణంగా కాంటాక్ట్ అయిన వారెందరు? అన్న లెక్క తేల్చే పనిలో పడ్డ అధికారులు.. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

కుటుంబ సభ్యులతో సహా సదరు ఐటీ ఉద్యోగి 88 మందిని కలుసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. అందులో 45 మందిని గుర్తించిన అధికారులు వారిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిరర్వహిస్తున్నారు. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. సదరు ఐటీ ఉద్యోగి కాంటాక్ట్ అయిన వారిలో 36 మందికి కొవిడ్ వైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకూ వెల్లడి కాలేదు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చే సమయంలో సదరు ఐటీ ఉద్యోగి కొవిడ్ వైరస్ లక్షణాలు బయటకు రాలేదన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఇంతకీ ఆ ఉద్యోగి పని చేస్తున్న ఐటీ సంస్థ పేరేమిటి? అన్న విషయంలోకి వెళితే.. సదరు సంస్థ పేరు గ్లోబల్ టెక్నాలజీ పార్క్ అని కొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ కంపెనీ బెంగళూరులో ఉన్నట్లుగా చెబుతున్నారు.