Begin typing your search above and press return to search.

చావు రాసి పెట్టి ఉంటే ఇలానే జరుగుతుందేమో?

By:  Tupaki Desk   |   21 Aug 2019 8:18 AM GMT
చావు రాసి పెట్టి ఉంటే ఇలానే జరుగుతుందేమో?
X
వేదాంతం ఎంతమాత్రం కాదు. విషయాన్ని చూసే విభిన్న కోణంగా దీన్ని చెప్పాలి. తాజా ఉదంతం విన్నంతనే మనసుకు అనిపించే భావనగా దీన్ని చెప్పాలి. మరణానికి అతీతం ఎవరూ కాదని.. చావు రాసి పెట్టి ఉంటే ఎంతకూ తప్పించుకోరని చెబుతారు. తాజా ఉదంతం చూస్తే.. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించక మానదు. ఆశ్చర్యానికి మించిన విస్మయంగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

హైదారాబాద్ లోని అల్మాస్ గూడకు చెందిన కార్పెంటర్ యాబై ఏళ్ల ఆనంద్. అతనికి ఇద్దరు కొడుకులు. బేగంపేట నుంచి ఫలక్ నుమాకు ఎంఎంటీఎస్ లో వెళుతున్న అతనికి మలక్ పేట స్టేషన్ వద్ద గుండెపోటుకు గురయ్యారు. వెంటనే.. ప్రయాణికులు స్పందించి 108కి ఫోన్ చేశారు.

దగ్గర్లోనే అంబులెన్స్ ఉండటంతో వేగంగా స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. హుటాహుటిగా అతన్ని స్టేషన్ బయటకు తీసుకొచ్చారు. గుండెపోటుకు గురి కావటం.. సహ ప్రయాణికుడు స్పందించటం.. వెంటనే అంబులెన్స్ రావటం చేసినోళ్లంతా అతను ఏదోలా బతుకుతాడన్న భావన కలిగింది. ఇక్కడే.. సీన్ మొత్తం మారిపోయింది. అంబులెన్స్ సిబ్బంది ఆనంద్ ను పట్టుకొని బయటకు తీసుకొచ్చినా..కీలకమైన వేళ అంబులెన్స్ డోర్ లాక్ పడిపోయి ఉండటం.. అదెంతకూ ఓపెన్ కాని పరిస్థితి.

దీంతో.. అతడికి ఇవ్వాల్సిన ప్రాథమిక చికిత్స కోసం.. అంబులెన్స్ అద్దాలు పగులగొట్టేశారు. అయితే.. అప్పటికే 20 నిమిషాలు గడిచిపోవటం.. ఆనంద్ చనిపోవటం జరిగిపోయాయి. అతన్నికాపాడేందుకు తోటి ప్రయాణికుల దగ్గర నుంచి అంబులెన్స్ సిబ్బంది వరకూ అందరూ ప్రయత్నించినా మరణించటం అక్కడి వారిని కలిచివేసేలా చేసింది. ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా చనిపోవటం చూస్తే.. మరణం రాసి ఉన్నప్పుడు ఇలాంటి అనూహ్య ఘటనలే జరుగుతాయన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.