Begin typing your search above and press return to search.

శభాష్ హైదరాబాద్ మెట్రో.. 21కి.మీ. 25 నిమిషాల్లోనే!

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:26 AM GMT
శభాష్ హైదరాబాద్ మెట్రో.. 21కి.మీ. 25 నిమిషాల్లోనే!
X
మనిషి నిద్ర పోతున్నా.. లేచి ఉన్నా.. అన్ని కాలాల్లో అలానే పని చేస్తూ ఉంటుంది గుండె. మిగిలిన శరీర అవయువాలతో పోలిస్తే గుండె అత్యంత కీలకమైనది. సగటున మనిషి శరీరంలో ఉండే గుండె బరువు పావు కేజీకి కాస్త అటుఇటుగా ఉంటుంది. ఇదే.. మనిషిని బతికించినా.. చంపేసినా. అయితే..కొన్ని సందర్భాల్లో ఊపిరి వదిలేసిన.. చావు బతుకుల మధ్య ఉండే ఒక మనిషిలోని గుండె.. మరో మనిషి ప్రాణాన్ని కాపాడటమే కాదు.. కొత్త జీవితాల్ని ఇస్తుంటుంది. అయితే.. ఒకరి నుంచి బయటకు తీసిన గుండెను.. అతి తక్కువ వ్యవధిలో మరో వ్యక్తిలోకి మార్చగలిగితే.. ప్రాణం పోసినట్లే. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టినట్లే.

తాజాగా అలాంటి గుండెను మెట్రో రైలులో తరలించిన వైనం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న వేళ.. ట్రాఫిక్ జాం ఎంతలా ఉందన్న సంగతి తెలిసిందే.

అలాంటి వేళలో.. గుండెను యుద్ధ ప్రాతిపదికన మార్చేందుకు వరంలా మారింది మెట్రో రైల్. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కుటుంబం.. గుండెను దానంగా ఇవ్వటానికి ఒప్పుకోవటంతో జబ్లీహిల్స్ లోని మరో రోగికి పునర్జన్మను ఇచ్చినట్లైంది.

నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి మెదడుకు తీవ్ర గాయమైంది. దీంతో.. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించగా.. ఆరోగ్యం విషమించి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి కిడ్నీలు.. గుండె.. కాలేయం.. కార్నియాను దానం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇదే సమయంలో మూత్రపిండాలు.. గుండె దెబ్బ తిని చికిత్స పొందుతున్న 32 ఏళ్ల వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుకు వీలుగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు జరిగాయి.

ఇందులో భాగంగా కామినేని ఆసుపత్రి నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ కు అంబులెన్సు ద్వారా 3 నిమిషాల్లో గుండెను తరలించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రోస్టేషన్ కు 21 కిలోమీటర్ల దూరం కాగా మధ్యలో 17 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక మెట్రో రైల్ ను ఎక్కడా ఆపకుండా కేవలం 25 నిమిషాల వ్యవధిలో చేర్చారు.

అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి కేవలం 3 నిమిషాల్లో చేర్చి.. కిడ్నీ.. గుండె మార్పిడిని పూర్తి చేశారు. దీంతో.. నిండు ప్రాణం బతికింది. ఈ ఆపరేషన్ లో మెట్రో రైల్ కీలకభూమిక పోషించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.