Begin typing your search above and press return to search.

తొలి దశ మెట్రో పరుగులు మొదలయ్యేది ఎక్కడ?

By:  Tupaki Desk   |   19 Feb 2016 4:56 AM GMT
తొలి దశ మెట్రో పరుగులు మొదలయ్యేది ఎక్కడ?
X
ఏళ్లకు ఏళ్లుగా తెలుగువారు మరీ ముఖ్యంగా హైదరాబాదీయులు మెట్రో రైల్ కోసం ఎంతో ఆశగా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి చేసుకొని.. మరికొన్ని చోట్ల నిర్మాణం అసలే మొదలుకాక.. వైరుధ్యంగా ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి అయి.. రైలు ఎపుడు పట్టాల మీదకొస్తుందా అని జనం ఆతృతగా ఉన్నారు.

అయితే.. అలైన్ మెంట్లలో ఉన్న సమస్యలు.. ఆస్తుల అప్పగింతలో చోటు చేసుకున్న లొల్లి.. రాజకీయ కారణాలు వెరసి.. మెట్రో రైల్ పనులు రోజురోజుకీ ఆలస్యమవుతున్న పరిస్థితి. దీంతో.. మెట్రో రైలు ఎప్పుడు షురూ అవుతుందన్న అంశంపై పెను సందిగ్థత వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఈ జూన్ నాటికి మెట్రో రైలుని ప్రారంభిస్తామని చెప్పి కొత్త ఉత్సాహాన్ని నింపారు. అపుడే ఫిబ్రవరి అయిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు పట్టాల మీదకు ఎక్కేందుకు సీఎం హామీ ప్రకారం కేవలం మూడు నెలల గడువే ఉంది. మరి అప్పట్లోపు అవుతుందా? ఒకవేళ అయితే మెట్రో రైలు ఏ వైపు నుంచి మొదలు కానుంది? అన్నది ఆసక్తికరగా మారింది.

అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మెట్రో రైల్ ను రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించే వీలుందని తెలుస్తోంది. తొలుత మియాపూర్ – ఎస్ ఆర్ నగర్ వరకు, నాగోల్ – మెట్టుగూడ వరకూ మెట్రో నడుస్తుందని చెబుతున్నారు. మొత్తం ఆరు దశల్లో ప్రారంభమయ్యే మెట్రో తొలిదశ అనుకున్నట్లే జూన్ లో షురూ అయితే.. గ్రేటర్ జీవికి అంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది? పెండింగ్ పనుల్ని ఎప్పటికి పూర్తి చేయిస్తారన్నది మంత్రి కేటీఆర్ సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు.