Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోప‌ల‌కు మెట్రో!

By:  Tupaki Desk   |   2 May 2018 4:45 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోప‌ల‌కు మెట్రో!
X
ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు త్వ‌ర‌లో మెట్రో సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీల‌క ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. మెట్రో రైలును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోప‌ల‌కు తీసుకురావాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా తెలిసిందే. విమానాశ్ర‌య ప్రయాణికుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయ‌టం.. భారీ ల‌గేజ్ చేతిలో ఉండే నేప‌థ్యంలో ఎయిర్ పోర్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చి మెట్రో ఎక్క‌టం ప్రాక్టిక‌ల్ గా ఇబ్బందులు ఉన్న నేప‌థ్యంలో ఎయిర్ పోర్ట్ లోప‌ల వ‌ర‌కూ మెట్రో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

సాధార‌ణంగా విమాన ప్ర‌యాణాలు చేసే వారిలో.. దేశీయ ప్ర‌యాణికుల ల‌గేజీ కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. విదేశీ ప్ర‌యాణికుల ల‌గేజీ ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. విమానాల్లో ప్ర‌యాణించే వారిలో త‌క్కువ ల‌గేజ్ తో జ‌ర్నీ చేసే వారి సంఖ్య త‌క్కువే. ఈ నేప‌థ్యంలో ల‌గేజీని ప‌ట్టుకొని మెట్రో స్టేష‌న్ కు వెళ్ల‌టం ఒక స‌మ‌స్య అయితే.. దానిని ఎయిర్ పోర్ట్ లోప‌ల‌కు.. మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసుకురావ‌టం ఇబ్బందికి గురి చేసే అంశం.

ఈ నేప‌థ్యంలో శంషాబాద్ వ‌ర‌కూ విస్త‌రించ‌నున్న మెట్రో మార్గాన్ని ఎయిర్ పోర్ట్ లోప‌ల‌కు వ‌ర‌కూ తీసుకొచ్చేందుకు వీలుగా అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అథారిటీతో మెట్రో అధికారులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అలైన్ మెంట్ ఎలా ఉండాలి. ఎక్క‌డి వ‌ర‌కూ మెట్రో రావాల్సి ఉంటుంది? అందుకు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ విష‌యం ఎలా? లాంటి అంశాల‌తో పాటు తాము తీసుకునే నిర్ణ‌యం కార‌ణంగా వ‌చ్చే ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఏమిట‌న్న అంశంపై దృష్టి సారించారు.

మొద‌ట అనుకున్న మెట్రో ను ఎల్ అండ్ టీ.. హైద‌రాబాద్ మెట్రో క‌లిసి నిర్మిస్తుండ‌గా.. శంషాబాద్ వ‌ర‌కూ పొడిగించే మెట్రోను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే సొంతంగా చేప‌ట్ట‌నుంది. దీంతో.. శంషాబాద్ వ‌ర‌కూ ఏర్పాటు చేసే మెట్రో మార్గానికి సంబంధించిన స‌ల‌హాలు.. సూచ‌న‌లు.. ప్రాజెక్టుకు సంబంధించిన కీల‌కాంశాలపై నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి ఢిల్లీ మెట్రో సాయం చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ మెట్రో అధికారుల‌తో క‌లిసి ఢిల్లీ మెట్రో అథారిటీ వ‌ర్గాలు ప్రాథ‌మికంగా ఒక స‌ర్వే చేసి నివేదిక‌ను ఇచ్చారు. దీనికి సీఎం కేసీఆర్ ఓకే చెప్పేయ‌టంతో ప్ర‌భుత్వ‌మే సొంతంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ మెట్రోను నిర్మించేందుకు వీలుగా హైదారాబాద్ మెట్రో ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ పేరుతో ప్ర‌త్యేక సంస్థ‌ను ఏర‌పాటు చేశారు. ఈ ప్రాజెక్టును త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన డీపీఆర్ రూప‌క‌ల్ప‌న కోసం ఢిల్లీ మెట్రో అధికారులు గ‌డిచిన కొద్ది వారాలుగా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు.

హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా హైద‌రాబాద్ మెట్రో కీల‌క నిర్ణ‌యాల్ని ఒక్కొక్క‌టిగా తీసుకుంటోంది. హెచ్ ఎండీఏ (హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాభివృద్ధి సంస్థ‌) చేప‌ట్టిన ఔట‌ర్ రింగురోడ్డు ప్రాజెక్టులో కీల‌క అధికారిగా వ్య‌వ‌హ‌రించిన అధికారిని ఇటీవ‌ల రిటైర్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌న్ను శంషాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగ‌స్వామిని చేశారు. వీలైనంత వేగంగా శంషాబాద్ మెట్రోను పూర్తి చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు మ‌రో తీపిక‌బురు రానున్న‌ద‌న్న‌మాట‌.