Begin typing your search above and press return to search.

ప‌ట్టాలెక్క‌ని మ‌న మెట్రోకు 3 లిమ్కా రికార్డులు

By:  Tupaki Desk   |   16 Jun 2017 5:38 AM GMT
ప‌ట్టాలెక్క‌ని మ‌న మెట్రోకు 3 లిమ్కా రికార్డులు
X
హైద‌రాబాద్ మెట్రో గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏళ్ల‌కు ఏళ్లుగా నానుతున్న‌ న‌గ‌ర‌వాసుల క‌ల ఇది. ఈ ప్రాజెక్టు ప్రారంభం కావ‌టానికి ముందు నుంచే ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ఇక‌.. ప్రాజెక్టు మొద‌ల‌య్యాక‌.. ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా? అని ఎదురుచూశారు. కార‌ణాలు ఏవైనా మెట్రో మాత్రం మొద‌లు కాలేదు. ముమ్మ‌రంగా ప‌నులు మొద‌లై.. అనుకున్న నాటి కంటే ముందే మెట్రో పూర్తి అవుతుంద‌ని అనుకున్నా.. ఆ ఆశ‌లు నిజం కాలేదు.

కొన్ని రూట్లు పూర్తి అయినా.. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల కార‌ణంగా మెట్రో ఇంకా మొద‌లు కాలేద‌న్న ఫిర్యాదు ఉంది. ఈ కంప్లైంట్ల‌ను ప‌క్క‌న పెడితే.. ప‌ట్టాలు ఎక్కుండానే హైద‌రాబాద్ మెట్రో మూడు ఘ‌న‌త‌ల్ని సాధించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మూడు అంశాలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాయి. ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు భాగ‌స్వామ్యంలో నిర్మిస్తున్న ఈప్రాజెక్టుకు సంబంధించి ప్ర‌యాణికుల టిక్కెట్ల ద్వారా వ‌చ్చే ఆదాయంలో యాభై శాతం మాత్ర‌మే నిర్మాణ సంస్థ‌కు ఇస్తారు. అంటే.. టిక్కెట్ల మీద వ‌చ్చే ఆదాయంలో ఎల్ అండ్ టీకి వ‌చ్చేది 50 శాత‌మే. మిగిలిన ఆదాయాన్ని వివిధ మార్గాల్లో స‌మ‌కూర్చుకోవాల్సి ఉంది.

దీంతో.. ప్ర‌చారం ద్వారా.. ప్ర‌క‌ట‌న‌ల ద్వారా త‌న ఆదాయ మార్గాల్ని ఎల్ అండ్ టీ మొద‌లు పెట్టేసింది. గ‌తంలో ఏ మెట్రోకి లేని రీతిలో కొత్త రికార్డును హైద‌రాబాద్ మెట్రో సాధించింది. ప‌ట్టాలెక్క‌క ముందే ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంది. హైద‌రాబాద్ సాధించిన మూడు లిమ్కా రికార్డుల్ని చూస్తే..

1. మెట్రో ప్రారంభానికి ముందే ట్ర‌య‌ల్ ద‌శ‌లోనే మెట్రో రైలుపై ప్ర‌క‌ట‌న‌ల‌కు ఒప్పందం చేసుకున్న మొద‌టిది. ట్ర‌య‌ల్ ర‌న్ లోనే ట్రైన్ మొద‌టి మూడు కోచ్ ల‌పై చెప్పుల బ్రాండ్ ప్ర‌క‌ట‌న‌ల‌తో మెట్రోను తిప్ప‌టం

2. అన్ని మెట్రో స్టేష‌న్ల‌లో అమ్మే కూల్ డ్రింక్స్ ఒకే బ్రాండ్‌ వి అమ్మ‌టం. ఎల్ అండ్ టీ మెట్రో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో.. కోక్‌.. థ‌మ్స్ ఆప్ త‌దిత‌ర బ్రాండ్లు మాత్ర‌మే అమ్ముతారు.

3. అన్ని మెట్రో స్టేష‌న్ల‌లో శ్రేయాస్ బ్రాడ్ కాస్టింగ్ ప్ర‌సార హ‌క్కుల్ని సొంతం చేసుకుంది. 2015 జ‌న‌వ‌రి 29న జ‌రిగిన ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమ‌ల్లో ఉండ‌నుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/