Begin typing your search above and press return to search.

మెట్రో ప్ర‌యాణికుల‌కు తీపిక‌బురు!

By:  Tupaki Desk   |   27 Feb 2018 5:39 AM GMT
మెట్రో ప్ర‌యాణికుల‌కు తీపిక‌బురు!
X
ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ మెట్రో మీద వ‌స్తున్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న విష‌యం తెలిసిందే. మొద‌ట్లో మెట్రో రైళ్లు అన్నీ ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోగా.. త‌ర్వాత కాలంలో మెట్రో ముఖం చూడ‌టాన్ని త‌గ్గించేశారు న‌గ‌ర ప్ర‌జ‌లు. టైమింగ్స్ మొద‌లు.. ఫ్రీక్వెన్సీతో పాటు.. టికెట్ ధ‌ర‌లు భారీగా ఉండ‌టం.. మెట్రో స్టేష‌న్ల ద‌గ్గ‌ర నుంచి ద‌గ్గ‌ర ప్రాంతాల‌కు వెళ్లే ర‌వాణా స‌దుపాయాలు పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌టం శాపంగా మారింది.

ఈ ప‌రిస్థితుల‌కు హైద‌రాబాద్ మెట్రో అధికారుల‌తో పాటు.. భాగ‌స్వామి ఎల్ అండ్ టీ నిర్ణ‌యాలేన‌న్న విమ‌ర్శ ఉంది. మెట్రో స్టార్ట్ చేసిన వెంట‌నే అన్ని వ‌ర్గాల‌కు అందుబాటులో ఉండేలా ఛార్జీలు ప్ర‌క‌టించి ఉంటే బాగుండేద‌న్న వాద‌న బ‌లంగా వినిపించినా.. ఎల్ అండ్ టీ పుణ్య‌మా అని ధ‌ర‌ల్ని వారు కోరుకున్న‌ట్లే ప్ర‌క‌టించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

అయితే.. మెట్రో ఆరంభంలో ఆద‌ర‌ణ బాగా ఉన్నా.. త‌ర్వాతి కాలంలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపించ‌టం.. మెట్రో అక్యూపెన్సీ రేటు త‌గ్గిపోవ‌టంతో కాయ‌క‌ల్ప చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు.

ఇటీవ‌ల మెట్రో అధికారుల‌తో స‌మావేశ‌మైన మంత్రి కేటీఆర్ మెట్రో ఫ్రీక్వెన్సీ మీద అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన స‌మాచారం ప్ర‌కారం.. మెట్రో రైల్ టికెట్ల ధ‌ర‌పై ఎల్ అండ్ టీ అనుస‌రిస్తున్న తీరును త‌ప్పు ప‌ట్ట‌ట‌మేకాదు.. పాసుల జారీకి ఆల‌స్యం చేయ‌టం స‌రికాద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

మెట్రో ర‌ద్దీని పెంచేందుకే వీలుగా పాసుల్ని జారీ చేయాల‌ని భావిస్తున్నారు. అది కూడా ఏప్రిల్ నుంచి మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో క‌లిసి మెట్రోలో ప్ర‌యాణించిన పుర‌పాల‌క‌.. ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అర్వింద కుమార్ నోటి నుంచి మెట్రో పాసుల్ని ఏప్రిల్ నుంచి షురూ చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప్ర‌యాణికుల అవ‌స‌రాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచ‌టంతో పాటు.. మ‌రింత వేగంగా రైళ్ల‌ను న‌డిపేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. మ‌రి.. మెట్రో టికెట్ల మాదిరే మెట్రో పాసులు కాస్ట్ లీగా ఉంటాయా? లేక‌.. త‌క్కువ‌గా ఉంటాయా? అన్న‌ది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది.