Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రో కాదు.. వాట‌ర్ ఫాల్స్ అట‌!

By:  Tupaki Desk   |   26 Aug 2017 5:43 PM GMT
హైద‌రాబాద్ మెట్రో కాదు.. వాట‌ర్ ఫాల్స్ అట‌!
X
సోష‌ల్ మీడియా వ‌చ్చాక వార్త‌ల రూపురేఖ‌లు మారిపోయాయి. ప్ర‌జ‌ల చేతుల్లోకి వ‌చ్చేసిన సోష‌ల్ మీడియా ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా మారింద‌న‌టానికి నిద‌ర్శ‌నంగా ఇప్ప‌టికే ఎన్నో ఉదంతాలు చోటు చేసుకున్నాయి. తాజాగా హైద‌రాబాద్ ఇమేజ్ పై సోష‌ల్ మీడియాలో వేస్తున్న స‌టైర్లు ఆస‌క్తిక‌రంగా మారాయి. పండ‌గ‌పూట కురిసిన భారీ వ‌ర్షం ధాటికి హైద‌రాబాద్ చిగురుటాకులా వ‌ణికిపోయింది.

మూడు గంట‌ల పాటు నాన్ స్టాప్ గా.. ఆకాశానికి చిల్లుప‌డిన‌ట్లుగా కురిసిన వ‌ర్షం తీవ్ర‌త‌కు హైద‌రాబాద్ రోడ్లు చెరువులుగా మారిపోయాయి. ఇక‌.. దిగువ ప్రాంతాల్లో ఉన్న కాల‌నీలు అయితే.. ఓ భారీ జ‌ల‌పాతం కింద‌కు దుముకుతున్న‌ట్లుగా వాన తీరు పోటెత్తింది. వాన తీవ్ర‌త ఎంత ఎక్క‌వ‌గా ఉందంటే.. దిగువ ప్రాంతాల్లో ఉండే కాల‌నీల్లోని రోడ్ల మీద‌ నిలిపి ఉంచి ఆటోలు.. కాగిత‌పు ప‌డ‌వ‌ల్లా మారిన వైనం షాకింగ్ గా మార్చింది.

అంతేనా.. రోడ్లు మొత్తం నీళ్లు నిల‌బ‌డిపోయి.. వాహ‌నాలు వెళ్లేందుకు తీవ్ర ఆటంకంగా మారింది. అదృష్ట‌వ‌శాత్తు రాత్రి తొమ్మిది గంట‌ల త‌ర్వాత వ‌ర్షం ప్రారంభ‌మై.. ప‌ది గంట‌లు దాటాక త‌న విశ్వ‌రూపాన్ని చూపించింది. అదృష్ట‌వ‌శాత్తు.. పండ‌గ రోజు కావ‌టం.. లాంగ్ వీకెండ్ కార‌ణంగా చాలామంది హైద‌రాబాద్ నుంచి సొంతూళ్ల‌కు వెళ్ల‌టంతో రోడ్ల మీద ట్రాఫిక్ పెద్ద‌గా లేదు. ఇదే టైంలో భారీగా కురిసిన వ‌ర్షంతో ట్రాఫిక్ క‌ష్టాల నుంచి జ‌నాలు చాలా వ‌ర‌కు త‌ప్పించుకున్నార‌ని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుకాని ఒక చిత్ర‌మైన దృశ్యం ఒక‌టి ఆవిష్కృత‌మైంది. భారీ వ‌ర్షానికి న‌గ‌రంలోని ఒక మెట్రో స్టేష‌న్ స‌మీపంలో మెట్రో ఫిల్ల‌ర్ నుంచి భారీగా నీళ్లు కింద‌కు ప‌డింది. ఇది వాట‌ర్ ఫాల్ ను మించేలా ఉండ‌టం న‌గ‌ర ప్ర‌జ‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

దీన్ని వెంట‌నే వీడియో తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైద‌రాబాద్ వాన క‌ష్టాల‌పై ప‌లువురు నెటిజ‌న్లు ఎట‌కారం చేసేసుకున్నారు. హైద‌రాబాద్ కు భారీ జ‌ల‌పాతం లేని లోటు తీరింద‌ని కొంద‌రు.. న‌గ‌రంలో కొత్త ప‌ర్యాట‌క కేంద్రాలుగా నెల‌కొల్పిన మెట్రో రైల్‌కు థ్యాంక్స్ అంటూ మ‌రికొంద‌రు.. న‌యా వాట‌ర్ ఫాల్స్ చూడండి బాస్ అంటూ ఇంకొంద‌రు వాట్సాప్.. సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.