Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మెట్రో రైలు పేరు గొప్ప ఊరు దిబ్బ

By:  Tupaki Desk   |   14 Feb 2018 12:08 PM GMT
హైద‌రాబాద్ మెట్రో రైలు పేరు గొప్ప ఊరు దిబ్బ
X
హైద‌రాబాద్ మెట్రోరైలు ప‌రిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా త‌యారైంది. హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల్ని ట్రాఫిక్ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు పీఎం మోడీ చేతుల మీదిగా న‌వంబ‌ర్ 28,2017న హైద‌రాబాద్ మెట్రో రైలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. తొల‌త ఈ మెట్రో రైలును మోడీ మియాపూర్-అమీర్‌ పేట-నాగోలు మధ్య 30 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను పైలాన్ ఆవిష్కరణ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. అప్ప‌టి నుంచి ఈ మెట్రో రైలు అంద‌రి అంచ‌నాల్ని త‌ల్ల‌కిందులు చేసింది. మెట్రోరైలు అందుబాటులోకి వ‌చ్చింది. ట్రాఫిక్ క‌ష్టాలు తీరిపోతాయి. రోడ్ల‌న్నీ బోసి పోతాయి అని అందరు అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే మెట్రోరైలులో రోజుకు ల‌క్ష‌మందికి పైగా న‌గ‌ర వాసులు ప్ర‌యాణించేవారు. దీంతో రైల్వే అధికారులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తూ రోజుకి ఇంతమంది న‌గ‌ర వాసులు ప్ర‌యాణించార‌ని గొప్ప‌లు చెప్పుకున్నారు.

అంతేకాదు రానున్న కాలంలోమ‌రిన్ని సౌక‌ర్యాల‌తో మెట్రోరైలు కిట‌కిట‌లాడుతూ ప్ర‌యాణికుల‌తో స‌రికొత్త‌ రికార్డుల‌ను సృష్టిస్తుందని సంబంధిత అధికారులు చెప్పుకున్నారు. రాను రాను పరిస్థితి మారింది. ప్ర‌యాణికులు లేక మెట్రో రైలు వెల‌వెల‌బోతున్న‌ట్లు స‌మాచారం. దీంతో మెట్రో అధికారులు నియ‌మించిన ఉద్యోగుల్ని తొల‌గించే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

తొల‌త ల‌క్ష‌మందికి పైగా న‌గ‌ర వాసులు ప్ర‌యాణిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా ...అవి ప్ర‌క‌ట‌న‌లకే సాధ్య‌మైంది. మొద‌ట్లో మెట్రో రైలు ప్ర‌యాణాన్ని ఆస్వాధిద్దామ‌ని వ‌చ్చిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో రాను రాను ప్ర‌యాణికుల సంఖ్య త‌గ్గింది. దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్న‌ట్లు ప్ర‌యాణికులు చెబుతున్నారు.

న‌గ‌రంలో దూర‌ప్రాంతాలకు ఆఫీసుల‌కు వెళ్లే వారు ఆర్టీసీని - క్యాబుల్ని ఆశ్ర‌యిస్తున్నారే త‌ప్ప మెట్రోరైలు జోలికి పోవ‌డంలేదు. స‌మ‌య పాల‌న లేక‌పోవ‌డం - టికెట్ ఛార్జీలు అధికంగా ఉండ‌డం - కాంబినేష‌న్ - నెల‌వారి పాసులు లేక‌పోవ‌డంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటున్నారు. దీనికి తోడు ప్ర‌యాణికుల సౌక‌ర్యాలు ఊహించినంత‌గా లేవ‌ని - మెట్రో స్టేష‌న్ ల‌లో మంచినీళ్లు తాగాల‌న్నా ఆప‌సోపాలు ప‌డాల్సివ‌స్తుంద‌ని న‌గ‌ర‌వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువ‌కుడు మెట్రోలో మంచినీళ్లు తాగుదామ‌ని వెత‌క‌గా ఎక్క‌డా చుక్క‌నీళ్లు లేక‌పోవ‌డంతో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ మ‌ద్యం బాటిళ్ల‌ను మెట్రోస్టేష‌న్ లోకి తెచ్చేందుకు ప్ర‌యత్నించాడు. ఆ యువ‌కుడి ప్ర‌య‌త్నాన్ని ప‌సిగ‌ట్టిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెట్రో అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ద‌రు యువ‌కుడు మెట్రో అధికారుల‌కు బుద్ధిరావాల‌నే ఉద్దేశంతో ఇలా చేశాన‌ని - మంచినీళ్లు తాగాల‌న్నా సాధ్యంకావ‌డంలేద‌ని వాపోయాడు.

దీనికి తోడు అధిక చార్జీలు హైద‌రాబాద్ మెట్రో రైలు నిర్మాణ సంస్థ ఎల్ ఆండ్ టీ భారీగా ఆదాయాన్ని దండుకోవాల‌నే ఉద్దేశంతో మెట్రో రైలు టికెట్ల‌ను విప‌రీతంగా పెంచింది. దీంతో ఆ టికెట్ల‌ను కొనుగోలు చేయ‌డం ఇష్టం లేని ప్ర‌యాణికులు క‌ష్ట‌మైనా స‌రే బ‌స్సుల్లో ప్ర‌యాణించేందుకు మ‌క్కువ చూపుతున్నారు.

మెట్రో రైలు నిర్మించిన సద‌రు సంస్థ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం 290ఎక‌రాల స్థ‌లాన్ని 30ఏళ్ల పాటు కేటాయించింది. ఆ స్థ‌లంలో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో వేల‌కోట్ల ఆదాయాన్ని గ‌డిస్తున్న మెట్రో సంస్థ యాజ‌మాన్యం ఛార్జీలు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అంతేకాదు ఢిల్లీ - బెంగ‌ళూరు ఇలా అన్నీ మెట్రో రైలు ఛార్జీల కంటే హైద‌రాబాద్ మెట్రోరైలు ప్ర‌యాణ ఛార్జీలు అధికమ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీంతో మూడు నెలలు గడవకముందే మెట్రో ప్రయాణం అంటేనే.. బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది.