Begin typing your search above and press return to search.

మెట్రో రైల్ టోకెన్‌.. స్మార్ట్ కార్డు ఇలా ఉంటాయ్‌

By:  Tupaki Desk   |   10 Nov 2017 4:54 AM GMT
మెట్రో రైల్ టోకెన్‌.. స్మార్ట్ కార్డు ఇలా ఉంటాయ్‌
X
ఒక‌టి కాదు రెండు కాదు.. దాదాపు రూ.15వేల కోట్ల వ‌ర‌కూ పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌.. ఆ మొత్తాన్ని అణాపైస‌ల‌తో స‌హా వెన‌క్కి తీసుకోవాల‌ని భావించ‌టం అత్యాశే కాదు. ఒక‌వేళ‌.. శాశ్వితంగా ఆదాయం వ‌స్తుందంటే కాస్త చూసీ చూడ‌న‌ట్లుగా పోవ‌చ్చు. ప‌రిమిత‌కాలంలోనే తాము పెట్టిన భారీ పెట్టుబ‌డిని వ‌డ్డీతో స‌హా వెన‌క్కి తీసుకోవాలంటే ఏ చిన్న ఆదాయ అవ‌కాశాన్ని వ‌దులుకోకూడ‌దు.

తాజాగా హైద‌రాబాద్ మెట్రో రైల్ వ్య‌వ‌హారం ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. మ‌రో 18 రోజుల్లో ప్రారంభం కానున్న హైద‌రాబాద్ మెట్రో రైల్‌ కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెట్రోరైల్ ప్ర‌యాణంలో కీల‌క‌మైన టికెట్ పైన ప్ర‌క‌ట‌న మీద భారీ ఆదాయానికి ఎల్ అండ్ టీ సంస్థ వ్యూహం సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ మెట్రోలో ఉప‌యోగించే టోకెన్‌.. స్మార్ట్ కార్డులు ఎలా ఉంటాయ‌న్న‌ది కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్ మెట్రోకు సంబంధించి రెండు ర‌కాల టికెట్ల‌ను సిద్ధం చేశారు. ఇందులో మొద‌టిది టోకెన్‌. రెండోది స్మార్ట్ కార్డు. ఈ రెండు నీలం రంగులోఉండ‌టం గ‌మ‌నార్హం. మొద‌టి నుంచి నీలి రంగుకు అధిక ప్రాధాన్య‌త ఇచ్చే హైద‌రాబాద్ మెట్రో.. తాజాగా త‌న టికెట్ టోకెన్ ను సైతం నీలం రంగులో సిద్ధం చేశారు.

ఈ టోకెన్‌ కు ఒక‌వైపు మెట్రో సింబ‌ల్‌.. మ‌రోవైపు విశేష సంఖ్య‌తో పాటు.. ఖాళీ ప్ర‌దేశాన్ని ఉంచారు. అదే రీతిలో మెట్రో రైల్ ప్ర‌యాణానికి ఏటీఎం కార్డు త‌ర‌హాలో మ‌రో కార్డును త‌యారు చేశారు. వీటితోనే మెట్రోరైల్ ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు టికెట్ కొనుగోలు చేయాల‌న్న వారు టోకెన్ ను వినియోగిస్తే.. రోజూ టికెట్ క్యూలో నిలుచుకోకుండా ఉండాల‌నుకునే వారు స్మార్ట్ కార్డు వినియోగించుకునే వీలుంది.

ఈ రెండు టికెట్ మోడ‌ల్స్ కు ఒక‌వైపు ఖాళీ ప్ర‌దేశాన్ని ఉంచింది మెట్రో రైల్‌. ఇందులో ఏదైనా వ్యాపార సంస్థ‌..త‌మ బ్రాండ్‌ను ముద్రించుకోవ‌చ్చు. అలా ముద్రించిన దానికి భారీ మొత్తాన్ని వ‌సూలు చేయ‌నున్నారు. కొంత‌కాలానికి మాత్ర‌మే ఈ బ్రాండింగ్ స‌ద‌రు టోకెన్ మీద కానీ స్మార్ట్ కార్డు మీద కానీ ఉండ‌నుంది. ఇలా.. ఏ చిన్న అవ‌కాశాన్ని మిస్ చేసుకోకుండా వీలైనంత త్వ‌ర‌గా తాను పెట్టిన పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకోవాల‌ని భావిస్తోంది. వేలాది కోట్లు పెట్టుబ‌డి పెట్టి రిస్క్ తీసుకున్న హైద‌రాబాద్ మెట్రో ఆ మాత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించ‌టం త‌ప్పు కాదనే చెప్పాలి.