Begin typing your search above and press return to search.

20 మినిట్స్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి?

By:  Tupaki Desk   |   25 March 2018 5:00 AM GMT
20 మినిట్స్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి?
X
అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి.. రాకెట్ స్పీడ్ తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మెట్రో ట్రైన్ ను 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉంది తెలంగాణ స‌ర్కారు. ఇందులో భాగంగానే తాజా బ‌డ్జెట్ లో రూ.400 కోట్ల‌ను కేటాయించారు. ఇప్పుడు చెబుతున్న దాని ప్ర‌కారం ఈ ఏడాది లోపే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో ట్రైన్ ను సిద్ధం చేస్తున్నార‌ని చెబుతున్నా.. వాస్త‌వంలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లకు కాస్త ముందుగా పూర్తి అయ్యే వీలుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఏటా 1.80 కోట్ల మంది రాక‌పోక‌లు సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో విమాన ప్ర‌యాణం మ‌రింత ఊపందుకోనుంది. ఇలాంటి వేళ‌లో.. అవుట‌ర్ రోడ్ల‌లో గ్రోత్ కారిడార్ లో టౌన్ షిప్ అభివృద్ధి పేరుతో ఎయిర్ పోర్ట్‌ కు మెట్రోను లింక్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందులో భాగంగా రాయ‌దుర్గం టు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

గ‌చ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు 37 కిలోమీట‌ర్ల దూరాన్ని రూ.4650 కోట్ల‌తో పూర్తి చేయాల‌ని భావిస్తోంది. ఇందులో విదేశీ ఆర్థిక సంస్థ‌ల నుంచి రుణం తీసుకోవాల‌న్న ప్ర‌య‌త్నంలో ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌లో త‌ల‌మున‌క‌లైంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం రుణం వ‌చ్చేందుకు చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే చేస్తార‌ని చెబుతున్నారు.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న మెట్రోతో పోలిస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే మెట్రో రైలు చాలా వేగంగా న‌డుస్తుంద‌ని చెబుతున్నారు. 37 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం 20 నిమిషాల వ్య‌వ‌ధిలో చేరుకుంటార‌ని చెబుతున్నారు.

సాధార‌ణంగా మెట్రో గ‌రిష్ఠ వేగం గంట‌కు 85 కిలోమీట‌ర్లు కాగా.. క‌నిష్ఠం 55 కిలోమీట‌ర్లు. హైద‌రాబాద్ మెట్రోలో స‌రాస‌రిన కిలో మీట‌ర్ కు ఒక రైల్వే స్టేష‌న్ ఉండ‌టంతో ప‌రిమిత‌మైన వేగంలో మాత్ర‌మే ట్రైన్లు ప‌రుగులు తీస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో మాదిరి గ‌రిష్ఠంగా గంట‌కు 135 కిలోమీట‌ర్ల వేగంతో ప‌రుగులు తీయించాల‌ని భావిస్తున్నారు. ఈ మెట్రో రైలు క‌నిష్ఠ వేగం గంట‌కు వంద కిలోమీట‌ర్లు కావ‌టం గ‌మ‌నార్హం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఏర్పాటు చేసే మెట్రో కేవ‌లం ఐదారు స్టేష‌న్ల‌కే ప‌రిమితం చేయాల‌ని.. ప్ర‌యాణ స‌మ‌యం 20 నిమిషాలు మాత్ర‌మే ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో.. ఎక్కువ‌మంది మెట్రో ద్వారా ఎయిర్ పోర్ట్‌ కు చేరుకోవ‌టానికి మ‌క్కువ ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.