Begin typing your search above and press return to search.

వెనుక కాదు..ముందు నుంచేనని డిసైడ్ చేశారంట

By:  Tupaki Desk   |   14 Oct 2015 4:50 AM GMT
వెనుక కాదు..ముందు నుంచేనని డిసైడ్ చేశారంట
X
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఒక కీలక నిర్ణయంపై తుది నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైల్ పనుల్లో జాప్యం జరగటానికి కీలకమైన ఒక అంశంపై మొదట్లో తీసుకున్న నిర్ణయానికే ప్రభుత్వం అంగీకరించింది.

మెట్రో రైల్ ప్రాజెక్టులో లక్డీకాపూల్.. నాంపల్లి మధ్య మార్గం ఏర్పటులో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రవీంద్రభారతి.. ఆకాశవాణి.. గన్ పార్క్ .. కంట్రోల్ రూం మధ్యలో స్తంభాలను నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సిద్ధం కావటం.. దీనిపై నాటి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ముందు నుంచి మెట్రో రైల్ వెళ్లకూడదని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీ ముందు నుంచి మెట్రో రైల్ వెళితే చారిత్రక కట్టడాలకు ముప్పు అంటూ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు.. మెట్రోరైల్ కారణంగా తెలంగాణ చరిత్రలో అంతర్భాగమైన అమరవీరుల స్థూపం కాలగర్భంలో కలిసిపోతుందన్న వాదనను తీసుకొచ్చారు.

దీంతో.. మెట్రో రైల్ పనులు ఆగిపోయాయి. ప్రత్యామ్నాయం కోసం ఆలోచించి.. చివరకు అసెంబ్లీ వెనుక నుంచి వెళితే అభ్యంతరం లేదన్న వాదనను టీఆర్ ఎస్ తీసుకొచ్చింది. ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరపటంతో పాటు.. పనుల మీద కూడా ప్రభావం చూపించింది. చివరకు అసెంబ్లీ వెనుక మార్గం నుంచి మెట్రో రైల్ వెళ్లాలని నిర్ణయించారు. దీనిపై మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి.. తెలంగాణ సర్కారుకు మధ్య లేఖల యుద్ధం జరిగింది. చివరకు కేసీఆర్ సర్కారు మాటను ఎల్ అండ్ టీ ఒప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ.. తాజాగా మాత్రం అలాంటదేమీ లేదని తేల్చారు. అసెంబ్లీ వెనుక నుంచి వెళితే.. భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని.. భద్రతాపరమైన సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

దీంతో.. మొదట్లో అనుకున్న విధంగానే అసెంబ్లీ ముందు నుంచే మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడనప్పటికీ.. ఇంతకు మించి మరో మార్గం లేదన్న అభిప్రాయం మెట్రో రైల్ అధికారులు.. ప్రభుత్వ అధికారులు లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తానికి కేసీఆర్ సర్కారు మాటలకు.. చేతలకు మధ్య ఎంత అంతరం ఉంటుందనటానికి మెట్రో రైలు ఉదంతం నిలువెత్తు నిదర్శనమన్న వాదన షురూ అయ్యింది.