Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మెట్రో పరుగుకు రెఢీ అవుతోందా?

By:  Tupaki Desk   |   11 May 2020 5:16 AM GMT
హైదరాబాద్ మెట్రో పరుగుకు రెఢీ అవుతోందా?
X
ప్రమాదం మీద పడే అవకాశం ఉన్నప్పుడు..దాని ఎదుటకు వెళ్లే కన్నా.. తప్పుకునే మార్గానికి మించింది లేదు. ఈ క్రమంలోనే ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారు ఉండిపోవటం.. వ్యవస్థలు మొత్తం స్తంభించిపోవటం.. లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ.. ఎవరూ చూడని ఎన్నో జరిగిపోతున్నాయి.

హైదరాబాద్ విషయానికి వస్తే.. యాభై రోజులకు పైనే లాక్ డౌన్ నడుస్తోంది. ఆఫీసులు బంద్ కావటం.. వ్యాపార.. వాణిజ్య కార్యకలాపాలు మాత్రమే కాదు.. బతుకుబండికి సడన్ బ్రేకులు వేసి.. ఇంట్లోనే ఉంచేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ఒక్కొక్క రంగం తన పని మొదలుపెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైలు ఎప్పుడు పరుగు మొదలు పెడుతుందన్నది ప్రశ్న.

విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో కానీ.. మూడో వారంలో కానీ మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు (సోమవారం) నుంచి ఐటీ పరిశ్రమకు చెందిన సంస్థలన్ని 33 శాతం ఉద్యోగులతో ఆఫీసులు పని చేయనున్నాయి. మిగిలిన వారంతా ఎప్పటిలానే వర్క్ ఫ్రం హోంతో కానిచ్చేస్తున్నారు. ఈ రోజు నుంచి పరిమితమైన ఉద్యోగులతో ఆఫీసులు షురూ కానున్న వేళ.. ప్రజా రవాణా అవసరం చాలానే ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీ బస్సులు నడపటం సాధ్యం కాదు. ఇక.. ఉన్న అవకాశం హైదరాబాద్ మెట్రోనే. ఆటోలు.. క్యాబుల విషయం మీద కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గ్రీన్.. ఆరంజ్ జోన్ లలో ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న అధికారులు.. రానున్న కొద్ది రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు తీసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయం ఆధారంగా మెట్రో రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఏది ఏమైనా మరో మూడు వారాల వరకూ మాత్రం హైదరాబాద్ మెట్రో కూత పెట్టే ఛాన్సు లేనట్లే