Begin typing your search above and press return to search.

మెట్రోపై కేసీఆర్.. కేటీఆర్ చెప్పింది త‌ప్పైంది

By:  Tupaki Desk   |   9 Aug 2017 5:54 AM GMT
మెట్రోపై కేసీఆర్.. కేటీఆర్ చెప్పింది త‌ప్పైంది
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మ‌ణిహారంగా పేర్కొనే మెట్రో రైల్ ప్రాజెక్టు.. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. సీఎం కుమారుడు క‌మ్ మంత్రి అయిన కేటీఆర్ సైతం ఈ ఏడాదిలో మెట్రో రైలు క‌చ్ఛితంగా ప‌ట్టాలు ఎక్క‌నుంద‌ని ఇటీవ‌ల కాలంలో చెప్పుకొచ్చారు. అయితే.. అందుకు భిన్న‌మైన స‌మాచారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెట్రో రైలు ఈ ఏడాది ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌ట్టాలు ఎక్క‌టం సాధ్యం కాద‌ని.. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో ప‌ట్టాల‌కెక్క‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప‌రిమిత దూరానికి మెట్రోను ప్రారంభించ‌టం ద్వారా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉంద‌న్న భావ‌న‌తో టీఆర్ ఎస్ స‌ర్కారు ఉంద‌న్న మాట మొద‌టినుంచి వినిపిస్తున్నదే. అయితే.. ఈ ప్రాజెక్టును ముందుగా అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేసే విష‌యంలో కొన్ని అంశాలు అడ్డుకున్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో ఈ ప్రాజెక్టు ప‌నులు వేగంగా సాగుతున్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో 72 కిలోమీట‌ర్ల పొడ‌వున మెట్రో రైలు నిర్మాణం చేప‌ట్టాల‌ని కొన్నేళ్ల క్రితం అనుకున్నా.. పాత‌బ‌స్తీలో మెట్రో పనుల విష‌యంలో జ‌రిగిన జాప్యంతో ప్రాజెక్టు ఆల‌స్య‌మైంది.

నేటికీ పాత‌బ‌స్తీలో మెట్రో ప‌నులు మొద‌లు కాలేదు. పాత‌బ‌స్తీ మిన‌హా 66 కిలోమీట‌ర్ల మేర మెట్రోప‌నులు ఇప్పుడు సాగుతున్నాయి. దీన్లో.. వీలైనంత ఎక్కువ భాగం మెట్రో రైలును ప్రారంభం నుంచే ప‌రుగులు తీయాల‌న్న ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉంది. ఏడాది కింద‌టే నాగోలు నుంచి మెట్టుగూడ వ‌ర‌కు 8 కిలోమీట‌ర్ల మేర నిర్మాణ ప‌నులు పూర్తి అయ్యాయి. త‌నిఖీలు కూడా పూర్తి చేశారు. అదే స‌మ‌యంలో మియాపూర్ నుంచి ఎస్ ఆర్ న‌గ‌ర్ వ‌ర‌కూ ఉన్న 12 కిలోమీట‌ర్ల మేర ప‌నులు సైతం ఎనిమిది నెల‌ల క్రిత‌మే పూర్తి అయ్యాయి. మొత్తం ప్రాజెక్టులో ఇప్ప‌టికే పూర్తి అయిన రెండింటి దూరం 20 కిలోమీట‌ర్లు మాత్ర‌మే (మొత్తం 72 కిలోమీట‌ర్లు) ఈ రెండు రూట్ల‌లో సిద్ధ‌మైన స్టేష‌న్లు 17 స్టేషన్లు మాత్ర‌మే. పూర్తి స్థాయిలో అనుసంధానం లేక‌పోవటం వ‌ల్ల ఆద‌ర‌ణ విష‌యంలో ప‌లు సందేహాలు ఉన్నాయి. ఇదికూడా మెట్రో ప్రారంభం కాకుండా ఆల‌స్యం అవుతున్న ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. మెట్టుగూడ నుంచి బేగంపేట వ‌ర‌కూ నిర్మాణ ప‌నులు దాదాపుగా ఒక కొలిక్కి రావ‌టం.. ఒలిఫెంటా వంతెన వ‌ద్ద అతి పెద్ద ఉక్కు వంతెన ఏర్పాటు చేస్తే ఈ మార్గంలో బేగంపేట వ‌ర‌కూ మెట్రో ప‌రుగులు తీసిన‌ట్లే. అదే జ‌రిగితే కాస్త దూరం పెరిగిన‌ట్లు అవుతుంది. మియాపూర్ నుంచి ఎస్ ఆర్ న‌గ‌ర్ వ‌ర‌కు ప‌రిమితం చేయ‌కుండా అమీర్ పేట వ‌ర‌కూ మెట్రో రైలు న‌డిపితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని తెలుస్తోంది. అమీర్ పేట వ‌ద్ద ఇంట‌ర్ ఎక్సైంజ్ స్టేష‌న్ను నిర్మించాల్సి ఉంది. దీనికి ఆరేడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఓప‌క్క ఈ ప‌నులు చేస్తూనే.. మ‌రోవైపు అమీర్ పేట వ‌ర‌కూ మెట్రోను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వం కోరుతున్న‌ట్లు చెబుతున్నారు.

అదే జ‌రిగితే రెండో ద‌శ ప్రారంభం చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పూర్తి అవుతుంద‌న్న భావ‌న ఉంది. రెండో ద‌శ‌లో బేగంపేట నుంచి అమీర్ పేట‌.. అమీర్ పేట నుంచి నాంప‌ల్లి మ‌ధ్య‌న మెట్రో ను షురూ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌.. జ‌న‌వ‌రి మూడున ఎందుకు ముహుర్తం అంటే.. అదే రోజు జాతీయ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. దీనికి ప్ర‌ధాని మోడీ హాజ‌రుకావ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మెట్రో ప్రారంభం కూడా చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ఉంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. గ‌తంలో కేసీఆర్.. కేటీఆర్ లు చెప్పిన‌ట్లుగా ఈ ఏడాది అయితే మెట్రో ప‌రుగులు తీసే ఛాన్స్ లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.