Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు యువ‌కుడి అదృశ్యం!

By:  Tupaki Desk   |   25 July 2018 1:12 PM GMT
అమెరికాలో తెలుగు యువ‌కుడి అదృశ్యం!
X
కొద్ది రోజుల క్రితం అమెరికాలో తెలుగు విద్యార్థి కొప్పుల శ‌ర‌త్ దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. క‌రుడు గ‌ట్టిన హంత‌కుడు జ‌రిపిన కాల్పుల్లో శ‌రత్ దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న తీవ్రంగా క‌లిచి వేసింది. ఆ త‌ర్వాత పోలీసులు కాల్పుల్లో శ‌ర‌త్ హంత‌కుడు కూడా మ‌ర‌ణించ‌డం తెలిసిందే. ఆ హృద‌య విదార‌క‌ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే అమెరికాలో నివ‌సిస్తోన్న మ‌రో తెలుగు యువ‌కుడు అదృశ్య‌మ‌వడం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. న్యూయార్క్ లో ఉన్నత చదువులభ్య‌సించేందుకు వెళ్లిన హైదరాబాద్ యువకుడు మిర్జా అహ్మద్ అలీ బేగ్ (26) అదృశ్యమవ‌డం సంచ‌ల‌నం రేపింది. అత‌డు ప‌నిచేస్తోన్న మొబైల్ షాపులోనుంచి బ‌య‌ట‌కు వెళ్లిన బేగ్....క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అత‌డి స్నేహితులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం పోలీసులు ఈ మిస్సింగ్ మిస్ట‌రీ పై విచార‌ణ జ‌రుపుతున్నారు.

హైద‌రాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన బేగ్ మాస్టర్స్ చదివేందుకు 2015లో న్యూయార్క్ వెళ్లారు. అక్క‌డే ఓ మొబైల్ షాపులో బేగ్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. అయితే, ఈ నెల 20న త‌న తల్లితో బేగ్ ఫోన్ లో మాట్లాడినపుడు కంగారుప‌డ్డాడ‌ని తెలుస్తోంది. తనకు భయంగా ఉందని త‌ల్లికి చెప్పిన బేగ్....అందుకు గ‌ల కార‌ణం వివ‌రించ‌లేద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత ...బేగ్ సోద‌రుడు షుజాత్ బేగ్ ప‌లు మార్లు ఫోన్ చేయ‌గా స్విచ్ ఆఫ్ చేసి ఉంద‌ని తెలుస్తోంది. త‌మ‌కు చెప్ప‌కుండానే షాపు నుంచి బేగ్ బయటకు వెళ్లిపోయాడని ఆ షాపు యజమాని షుజాత్ బేగ్ కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. బేగ్ షాపు నుంచి వెళ్లిన‌ దృశ్యాలు సీసీటీవీలోనూ రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో తన సోదరుడ్నిఎవరో బెదిరిస్తున్నారని షుజాత్ చెబుతున్నారు. మ‌రోవైపు, త‌న కుమారుడి ఆచూకీ క‌నుక్కోవాల‌ని బేగ్ తండ్రి ఇస్మాయిల్ ....విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు.