Begin typing your search above and press return to search.

కోస్తా కోడిపందాల్లో హైద‌రాబాదీల హ‌ల్‌చ‌ల్‌

By:  Tupaki Desk   |   15 Jan 2018 10:29 AM GMT
కోస్తా కోడిపందాల్లో హైద‌రాబాదీల హ‌ల్‌చ‌ల్‌
X
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలవైపు వెళ్లే రోడ్లన్నీ జామ్ అయిపోతాయి. కేవలం ఆంధ్రప్రాంత ప్రజలే కాదు.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో సంక్రాంతి వినోదానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లంతా ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా ఎదిగిన నేపథ్యంలో ఆంధ్ర వ్యాపారులతో స్నేహబంధుత్వాన్ని పెంచుకొన్న పలువురు రియల్టర్లు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఐదురోజుల బస ఏర్పాటు చేసుకొన్నారు. వీరితోపాటు రాజకీయ నాయకులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు పెద్దఎత్తున తరలివెళ్లారు.

కొందరు విందులు వినోదాల కోసం వెళ్తే.. మరికొందరు కోళ్ల పందేలలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఆత్రంగా వెళ్లారు. అక్కడ సుమారు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పందేలు కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, గండిపేట, బాలాపూర్, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్‌కేసర్ మండలాలకు చెందిన రియల్టర్లు, రాజకీయ నాయకులు, కొందరు సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు ఆంధ్రాకు వెళ్లారు. శామీర్‌పేట మండలం తూంకుంట, ఆలియాబాద్, మలక్‌పేట, మజీద్‌పూర్, మేడ్చల్ మండలం పూడూరు, యాడారం, మురహరిపల్లి, కొంపల్లి, దూలపల్లి, నిజాంపేట, బాచుపల్లి, వట్టినాగులపల్లి, మణికొండ, కోకాపేట, అల్మాస్‌గూడ, బాలాపూర్ గ్రామాల నుంచి అత్యధికంగా వెళ్లినట్లు సమాచారం. వీరంతా ప్రధానంగా ఏలూరు, భీమవరం, పాలకొల్లు, అమలాపురం, ముమ్మిడివరం ప్రాంతాల్లో బస చేశారు. శనివారం ఉదయానికే వీరు ఆంధ్రాకు చేరుకున్నారు. కోడి పందేలు జరుగుతున్న సుమారు 500 గ్రామాల్లో వీరి సందడి కనిపిస్తున్నదని వెళ్లినవారు చెప్తున్నారు.

కాగా, ఈ అనుబంధం వెనుక ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం ఉందంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వేలమంది ఆంధ్రాకు చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డారు. వీరిలో నిర్మాణరంగానికి చెందిన వారి సంఖ్య అధికం. ప్లాట్లను కొనడం, అమ్మడం.. అనుమతులు పొందడం వంటి వ్యవహారాల్లో స్థానిక వ్యాపారులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ స్నేహబంధంతోనే ఈ ప్రాంతానికి చెందిన పలువురు రియల్టర్లు, నేతలు సంక్రాంతికి గోదావరి జిల్లాలకు వెళ్లారు. ఆంధ్ర ప్రజలు తమ తెలంగాణ మిత్రులను పండుగకు మా ఊరికి రారండోయ్ అంటూ ఆహ్వానించారు. ప్రధానంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, కౌన్సెలర్లు, వారి అనుచరగణమే అత్యధికంగా వెళ్లినవారిలో ఉన్నారు. పైగా వ్యాపార సంబంధాలు కలిగిన వారికి రాచమర్యాదల్లో ఏ లోటూ రానివ్వడం లేదు. ప్రత్యేకంగా విడిది ఇండ్లు కూడా కేటాయించారు. ఎన్ని రోజులు అక్కడ బసచేసినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో నెలరోజుల ముందే అతిథి గృహాలు, లాడ్జీల్లో అన్ని గదులనూ ముందస్తుగానే రిజర్వ్ చేసుకొన్నారు. సాధారణ సమయంలో రూ.500, రూ. 1000 చొప్పున ఉండే కిరాయి, ఇప్పుడు రెట్టింపయింది. ఏటా వెళ్లేవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు తలెత్తకపోయినా, అప్పటికప్పుడు వెళ్లినవారికి వసతి దొరకడం దుర్లభమే అవుతున్నది. మూడు నుంచి ఐదు రోజులపాటు ఉండే వారికి కనీసంగా రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతున్నది. పందెంరాయుళ్లు లక్షల రూపాయలు పందెం కాస్తున్నారు. ఈ ఏడాది విజయవాడ పరిసరాల్లో కూడా కోడిపందేలు పెద్ద ఎత్తున ప్రారంభం కావడం విశేషం. కంకిపాడు, నూజివీడు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహిస్తున్నారు.