Begin typing your search above and press return to search.

ఆ ఒక్క రోజు హైదరాబాదీయులు మెట్రోలోనే వెళ్లాలట!

By:  Tupaki Desk   |   10 Sep 2019 10:15 AM GMT
ఆ ఒక్క రోజు హైదరాబాదీయులు మెట్రోలోనే వెళ్లాలట!
X
హైదరాబాదీయులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త తరహా విన్నపాన్నిచేశారు. మరో రెండు రోజుల్లో (గురువారం) జరిగే గణేశే నిమజ్జనం సందర్భంగా ఆ ఒక్క రోజు మాత్రం వీలైనంతవరకూ మెట్రో రైళ్లను వినియోగించాలని కోరుతున్నారు. గణేశ్ నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారంతా ఆ ఒక్క రోజు మెట్రో రైల్ ను వినియోగించుకోవాలన్నారు.

ఇక.. నిమజ్జన వేళ అత్యంత కీలకమైన బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర 18 కిలోమీటర్ల మేర సాగుతుందని సిటీ ట్రాఫిక్ అదనపు డీసీపీ అనిల్ కుమార్ వెల్లడించారు. శోభాయాత్ర మధ్యలో ఎలాంటి వాహనాల్ని అనుమతించే ప్రసక్తే లేదన్న ఆయన.. సొంత వాహనాల్లో ప్రయాణించే వారు.. పోలీసులు చెప్పిన ప్రాంతాల్లోనే వాహనాల్ని నిలపాల్సి ఉంటుందన్నారు.

గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు విదేశీయులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని.. నిమజ్జన కార్యక్రమం జరిగే 30 గంటల పాటు నగరంలోకి ఎలాంటి ప్రైవేట్ లారీలను అనుమతించమన్నారు. ఆర్టీసీ బస్సుల్ని సైతం ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్న దారిలోనే నడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

నిమజ్జన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ఈ నేపథ్యంలో వీలైనంత వరకూ హైదరాబాదీయులంతా మెట్రో రైల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. సో.. గురువారం హైదరాబాదీయులు తమ వాహనాల్ని వీలైనంతవరకూ మెట్రో స్టేషన్ల వద్ద వదిలేసి.. మెట్రోలో ప్రయాణిస్తే.. ట్రాఫిక్ చిక్కులు కొంతమేర తగ్గటం ఖాయం. హైదరాబాద్ పోలీసుల విన్నపాన్ని హైదరాబాదీయులు ఎంతమేర పాటిస్తారో చూడాలి.