Begin typing your search above and press return to search.

ఫూణె ముదురుకేసును హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు

By:  Tupaki Desk   |   29 Aug 2020 11:10 AM GMT
ఫూణె ముదురుకేసును హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు
X
వాడెంత ముదురుకేసంటే.. పోలీసులు సైతం అతడి వంక చూసేందుకు భయపడతారు. పెద్ద పెద్ద పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు. తరచూ వారికి పార్టీలు ఇస్తుంటాడు. సొంత విమానాల్లో రాకపోకలు.. కోట్లల్లో సెటిల్ మెంట్లు చేసే అతడి రేంజ్ మామూలు కాదు. ఇలాంటి పెద్ద ముదురుకేసును తాజాగా హైదరాబాద్ పోలీసులు ఫూణెకు వెళ్లి మరీ అరెస్టు చేసుకొచ్చారు. ఇతగాడి మీద కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఫూణెకు వెళ్లిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేశాక.. అతడెంత పవర్ ఫుల్ అన్న విషయం తెలిసి.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ అతడెవరు? అతని నేర ప్రపంచం ఎంత పెద్దది? అతడు చేసే సెటిల్ మెంట్లు ఎంత భారీగా ఉంటాయన్న విషయంలోకి వెళితే.. అవాక్కు అవ్వాల్సిందే.

బిహార్ లో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమను నిర్వహించే కపిల్ అలియాస్ రాజేంద్రకుమార్ కు అసలు వ్యాపారం కంటే కూడా కొసరుగా సెటిల్ మెంట్లు చేసేస్తుంటాడు. అసలు కంటే కొసరు ముద్దు అన్న రీతిలో అతగాడి దందా మూడు పువ్వులు.. ఆరుకాయలుగా నడుస్తుంటుంది. తన వ్యాపార కార్యకలాపాల కోసం జర్నీ చేయాల్సి వస్తే ప్రైవేటు విమానాల్ని వాడేస్తుంటాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కంపెనీ రూపురేఖల్ని మార్చేశాడు. పోలీసులు.. రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు.

తక్కువ ధరకే గనుల లీజులు తీసుకోవటం.. పేలుడు పదార్ధాలు తయారు చేయటం చేస్తాడు. అమోనియం నైట్రేట్.. జిలిటెన్స స్టిక్స్.. డిటోనేటర్లకుగిరాకీ ఎక్కువగా ఉండటంతో తొమ్మిది రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించాడు. బిహార్ లోని ఒక పోలీసు అధికారి సహకారంతో చెన్నై.. హైదరాబాద్.. బెంగళూరులోని పోలీసు ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకున్న అతడు తన అనధికార వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మార్చేశాడు. తన దగ్గరకు వచ్చే సెటిల్ మెంట్లను కాదనకుండా చేసేవాడు. అందుకు భారీగా వసూలు చేసేవాడు.

ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరుసోదరులపై పేలుడు పదార్థాల వ్యతిరేక చట్టం కింద కేసు నమోదైంది. దీన్ని ఎత్తేస్తానని చెప్పి వారి నుంచి రూ.3.60 కోట్లు వసూలు చేశాడు. కానీ.. వారికి చెప్పినట్లుగా పని చేయలేదు. దీంతో.. వారు సీసీఎస్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. పక్కా ప్లాన్ తో ఫూణెకు వెళ్లి అరెస్టు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కానీ తాము పట్టుకున్నది ఎంత పెద్ద ముదురుకేసో అర్థం కాలేదు. దాదాపునాలుగు రాష్ట్రాల్లో నేరాలు చేస్తున్నా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా అరెస్టు కాని కపిల్ తాజాగా మాత్రం హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.