Begin typing your search above and press return to search.

రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు షాకుల మీద షాకులు

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:59 AM GMT
రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు షాకుల మీద షాకులు
X
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్ పర్యటనలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల పాటు రాజ‌ధానిలో ప‌ర్య‌టించేందుకు రాహుల్ గాంధీ త‌న షెడ్యూల్ నిర్దేశించుకోగా...ఇప్ప‌టికే పార్టీ నేత‌లు ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆయ‌న టూర్‌ కు తెలంగాణ‌ ప్ర‌భుత్వం త‌ర‌ఫున మొద‌టి ఝ‌ల‌క్ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాక‌రించారు. రాజ‌కీయ స‌భ‌ల‌కు అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ ఓయూ వీసీ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిప‌డ్డాయి.

ఓయూ నిషేధిత ప్రాంతం కాదని - రాహుల్‌ గాంధీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్టీ నేతలు మధుయాష్కీ - గీతారెడ్డి - శ్రీధర్‌ బాబు - అనిల్‌ కుమార్‌ లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమేరకు నెరవేరాయనే విషయాన్ని తెలుసుకునేందుకు రాహుల్‌ తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. సీఎం తన ధోరణి మార్చుకోకపోతే ఇనుప కంచెలను తొలగించి ఓయూకు వెళతామని ఆయన హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనకు అనుమతి లేదంటూ ఓయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ఓయూ విద్యార్థి నేతలు కూడా ఇదే అంశంపై ఉత్తమ్‌ ను కలిశారు.

మ‌రోవైపు రాహుల్ టూర్ సంద‌ర్భంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ర్యాలీకి అనుమ‌తి నిరాక‌రించారు. ఈ నెల 13 - 14న రాహుల్ ప‌ర్య‌ట‌న సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌ పోర్టు నుంచి ర్యాలీకి అనుమతి లేదని ఏసీపీ అశోక్‌ కుమార్‌ గౌడ్ వెల్లడించారు. శనివారం శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ లో ఆయన మాట్లాడారు. 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో ఎయిర్‌ పోర్టులో ఈ నెల 20 వరకు హైఅలర్ట్ ప్రకటించినట్టు వివరించారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆదేశాల మేరకు ఎయిర్‌ పోర్టు విజిటర్స్ ప్రవేశపాస్‌ లపై ఆంక్షలు విధించారన్నారు. నాలుగు ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు రెడ్ అలర్ట్ సందర్భంగా పది రోజులపాటు ఎయిర్‌ పోర్టు పరిసరాల్లో సభలు - ర్యాలీలు నిషేధించినట్టు చెప్పారు. ఈ ప‌రిణామం కాంగ్రెస్ శ్రేణుల‌కు మింగుప‌డ‌ని విధంగా ఉంది.

ఇదిలాఉండ‌గా... రాహుల్‌ పర్యటన షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నాంపల్లిలో ముస్లిం పెద్దలతో రాహుల్‌ ప్రత్యేకంగా భేటీ కోసం పార్టీ ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు ఎగ్జిభిషన్‌ గ్రౌండ్‌ లో చిరు వ్యాపారులతోనూ ఆయన సమావేశం కానున్నట్టు ప్రకటించింది. అయితే రెండు ప్రాంతాలను పరిశీలించిన ఎస్‌పీజీ ఈ రెండు ప్రాంతాలు సమస్యాత్మాకమైనవని - రాహుల్‌ పర్యటకు అనువైన చోటు కాదని కాంగ్రెస్‌ నేతలకు చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఒకరిద్దరూ బిజీగా ఉన్నా...మిగతా ఎమ్మెల్యేలు మాత్రం తమకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడంలేదని సీఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలిసింది.