Begin typing your search above and press return to search.

అంబేడ్క‌ర్‌ కు నివాళి అర్పించిన‌ వీహెచ్‌ పై కేసు న‌మోదు

By:  Tupaki Desk   |   14 April 2020 8:10 AM GMT
అంబేడ్క‌ర్‌ కు నివాళి అర్పించిన‌ వీహెచ్‌ పై కేసు న‌మోదు
X
ఏప్రిల్ నెల‌లో మ‌హ‌నీయుల జయంతి - వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు అధికంగా ఉంటాయి. మ‌హాత్మ‌జ్యోతిబాపూలే - బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ - అంబేడ్క‌ర్ వంటి మ‌హానీయుల కార్య‌క్ర‌మాలు ఉంటాయి. వీటిని వాడ‌వాడ‌లా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఘ‌నంగా చేసుకుంటారు. ఇక ఏప్రిల్ 14వ తేదీ వ‌చ్చిందంటే రాజ్యాంగ రూప‌క‌ర్త‌ - ద‌ళిత బాంధ‌వుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని ఉత్స‌వాల మాదిరి నిర్వ‌హిస్తారు. అయితే ఈ ఉత్స‌వాల‌పై క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది. ఇళ్ల‌ల్లోనే ఆ మ‌హ‌నీయుడికి ప్ర‌జ‌లు నివాళుల‌ర్పించారు. అయితే ప్ర‌తియేటా హైద‌రాబాద్‌ లోని ట్యాంక్‌ బండ్‌ పై ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ఉత్స‌వాలు భారీ స్థాయిలో జ‌రిగేవి. ఈసారి లాక్‌ డౌన్ నేప‌థ్యంలో ఎవ‌రూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు.

దీన్ని గ్ర‌హించిన కాంగ్రెస్ నాయ‌కుడు వి.హనుమంతరావు (వీహెచ్‌) ట్యాంక్‌ బండ్‌ కు చేరుకున్నారు. అక్క‌డ ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అయితే ఆయ‌న చేసిన ప‌ని లాక్‌ డౌన్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు వీహెచ్‌ పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించి అంబేడ్క‌ర్ విగ్రహానికి పులమాల వేశారని పోలీసులు తెలిపారు. కరోనాను నివారించేందుకు లాక్‌ డౌన్‌ అమలు చేస్తుంటే దానిని వీహెచ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా హనుమంతరావు పై 188 - 269 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌ డౌన్ సంద‌ర్భంగా ట్యాంక్‌ బండ్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. అంబేడ్క‌ర్ జయంతి సందర్భంగా ట్యాంక్‌ బండ్‌ కు ఎవ‌రూ రావొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ట్యాంక్‌ బండ్ పైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే వీహెచ్‌ పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు.