Begin typing your search above and press return to search.

చిన్నారి బైక్ ముచ్చట తీర్చేందుకు ట్రాఫిక్ ఆపారు

By:  Tupaki Desk   |   18 Aug 2015 4:02 AM GMT
చిన్నారి బైక్ ముచ్చట తీర్చేందుకు ట్రాఫిక్ ఆపారు
X
ఒక చిన్నారి కోసం పోలీసులు స్పందించారు. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న అతగాడి ముచ్చట తీర్చేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న ఏడేళ్ల పవన్ కుమార్ అనే బాలుడి కోసం మేక్ ఏ విష్ తో పాటు.. పోలీసులు చేయూతనివ్వటంతో అతగాడి బుజ్జి కోరిక తీరింది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ఎర్రగండ్లకు చెందిన పవన్.. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.

ఎక్కువ కాలం జీవించే అవకాశం లేని పవన్ కు ఓ బుజ్జి కోరిక ఉంది. రోడ్డు మీద బైక్ నడపాలన్న అతని కోరిక గురించి మేక్ ఏ విష్ ప్రతినిధులు పోలీసులకు చెప్పటం.. వారు దానికి స్పందించటంతో ఏర్పాట్లు జరిగిపోయాయి. డీసీపీ నేతృత్వంలో ఒక బ్యాటరీ బైక్ మీద సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ నుంచి చక్కర్లు కొట్టేందుకు అనుమతించారు. ఇందుకోసం ట్రాఫిక్ ను నియంత్రించటం విశేషం.

ఒక చిన్నారి కోరికను తీర్చటం కోసం అధికారులు మానవత్వంతో స్పందించటం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. తనకు మహేశ్ బాబు అంటే ఇష్టమని.. పెద్దయ్యాక సీబీఐ అధికారిని కావాలని ఉందని చెప్పిన చిన్నారి పవన్.. శ్రీమంతుడి సినిమాలో మాదిరి తాను కూడా తన గ్రామం కోసం పని చేస్తానంటూ పెద్ద మాటలే చెప్పుకొచ్చాడు.