Begin typing your search above and press return to search.

విచారించకుండానే వార్తలు వచ్చేస్తున్నాయా?

By:  Tupaki Desk   |   14 Oct 2019 10:13 AM GMT
విచారించకుండానే వార్తలు వచ్చేస్తున్నాయా?
X
ఇప్పుడు రిపోర్టింగ్ స్టైల్ మారిపోయింది. మిగిలిన రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ రూపురేఖలు మారిపోయాయి. వాట్సాప్ మేసేజ్ లతో వార్తలుగా మార్చేసిన వైనం ఇప్పుడు అంతకంతకూ పెరిగిపోతోంది. ఒక సంఘటన జరిగిందా? లేదా? అన్న విషయం కంటే.. మూడు నాలుగు గ్రూపుల్లో వచ్చిన సమాచారమే వార్తగా మారిపోతున్న పరిస్థితి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా అలాంటి తీరుతో అవాక్కు అయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో.. ఆయన కుమారుడి మీద పలు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. కోడెల కుమారుడ్ని పోలీసులు విచారించినట్లుగా వార్తలు వచ్చాయి.

వాస్తవం ఏమంటే.. బంజారాహిల్స్ పోలీసులు ఏపీకి వెళ్లింది వాస్తవమే కానీ.. కోడెల కుమారుడు శివరామ్ ను కలిసిందే లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా వాట్సాప్ గ్రూపుల్లోనూ.. కొద్ది గంటల తర్వాత వివిధ వెబ్ సైట్లలో మాత్రం హైదరాబాద్ నుంచి వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు శివరాంను కలిసి.. ఆయన్ను విచారించినట్లుగా వార్తలు వచ్చేశాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శివరాంను పోలీసులు కలవకుండానే కలిసినట్లుగా వార్త తయారుకావటమే కాదు.. దానికి తోడుగా తో విచారణలో పోలీసులు.. ఆయనకు మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందన్న విషయాలతో కూడిన వార్త ఇప్పుడు పలు చోట్ల దర్శనమిస్తోంది. దీనిపై శివరాం వర్గీయులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చింది లేదు.. కలిసింది లేదు.. ఆ మాటకు వస్తే.. ఆదివారం తాను ఉన్న చోటుకు.. పోలీసులు తనను విచారించిన చోటుకు సంబంధం లేదంటున్నారు. ఏమైనా.. వాస్తవాల్ని క్రాస్ చెక్ చేసేసుకోకుండా.. వాట్సాప్ మెసేజ్ ల మీద మీడియా సంస్థలు వార్తలు అచ్చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది.