Begin typing your search above and press return to search.

మందుబాబులు బీ కేర్ ఫుల్..చిక్కితే ఇక అంతే!

By:  Tupaki Desk   |   31 Dec 2019 10:31 AM GMT
మందుబాబులు బీ కేర్ ఫుల్..చిక్కితే ఇక అంతే!
X
మరికొన్ని గంటలలోనే కొత్త సంవత్సరం మొదలుకాబోతుంది. దీనితో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఉత్సాహంగా గడుపుతారు. పార్టీలు..అర్థరాత్రి కేక్‌ కట్ చేసి విషెస్ చెప్పుకుంటారు. ముఖ్యంగా యువత గురించి చెప్పక్కర్లేదు. వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బైక్ లు, కార్ల మీద తిరుగుతూ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్తూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అశ్లీల సంస్కృతులకు చోటివ్వకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.

అర్ధరాత్రి నుండి జరిగే న్యూ ఇయర్ వేడుకలకు మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కొరఢా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, నగర శివారు ప్రాంతాలైన షామీర్ పేట్ - కీసర - మేడ్చల్ - ఘట్‌ కేసర్‌ లలో కొత్త సంవత్సర వేడుకలు ఎక్కువగా జరిగే ఫాంహౌస్‌ లు - రిసార్టులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ అశ్లీల డాన్సులు - రేవ్ పార్టీలు జరగకుండా ఈ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు.

నగరాల్లోని ఖరీదైన ప్రాంతాలు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్‌ మార్పిడి జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కుషాయిగూడలో గంజాయి వంటి మత్తు పదార్థాలను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలను ఓ లాడ్జీలో స్వాధీనం చేసుకున్నారు. తాగి వాహనం నడిపితే, హైదరాబాద్ పోలీసుల నుంచి ఎదుర్కోవాల్సిన చట్టపరమైన ఇబ్బందులను అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఇవెంట్‌ ఆర్గనైజర్లకు నోటీసులు పంపారు. తాగి వాహనాలు నడిపితే మాత్రం భారీ జరిమానాలు, కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్‌ - బ్లూకోల్ట్స్‌ వాహనాలతో గస్తీని మరింత పెంచనున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు ఉండనున్నాయి. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్స్ ని ,అలాగే ఔటర్ రింగ్ రోడ్ ని కూడా రాత్రి 11 నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు మూసేయనున్నారు.